ఆపరేషన్ ముగిసింది.. అన్ని లక్ష్యాలను సాధించాం: ఇరాన్ సైన్యం

by Harish |   ( Updated:2024-05-03 11:22:51.0  )
ఆపరేషన్ ముగిసింది.. అన్ని లక్ష్యాలను సాధించాం: ఇరాన్ సైన్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: డమాస్కస్‌లోని రాయబార కార్యాలయంపై జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై తమ డ్రోన్, క్షిపణి దాడి అన్ని లక్ష్యాలను సాధించిందని ఇరాన్ సైన్యం ఆదివారం తెలిపింది. నిన్న రాత్రి మొదలైన ఆపరేషన్ ఈ ఉదయం వరకు విజయవంతంగా పూర్తయింది, అన్ని లక్ష్యాలను సాధించాం అని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహమ్మద్ బఘేరి స్టేట్ టీవీకి చెప్పారు. మేము ఈ ఆపరేషన్ పూర్తయినట్లు అనుకుంటున్నాము, దీనిని కొనసాగించే ఉద్దేశ్యం లేదు, ఇరాన్‌పై తదుపరి చర్య తీసుకోకుండా ఉండమని ఇజ్రాయెల్‌కు పిలుపునిస్తున్నాం, తిరిగా దాడులు మొదలుపెడితే దానికి మేము చాలా పెద్ద ప్రతిస్పందనను అందిస్తామని బఘేరి పేర్కొన్నట్లు తెలుస్తోంది.

శనివారం రాత్రి నుంచి 200కి పైగా డ్రోన్‌లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించగా వాటిని అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా దళాలు 70కి పైగా డ్రోన్‌లు, క్షిపణులను కూల్చి వేశాయి. అంతకుముందు ఇజ్రాయెల్‌కు ఉక్కుకవచంలా అండగా ఉంటామని బైడెన్ ప్రకటించారు. అలాగే, తిరిగి ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ఎలాంటి ప్రతీకార దాడులు చేయవద్దని ఆ దేశానికి సూచించినట్లు సమాచారం. సిరియా రాజధానిలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఏప్రిల్ 1 ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్‌కు చెందిన ఏడుగురు రివల్యూషనరీ గార్డ్‌లు చనిపోయారు. దానికి ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయెల్‌పై ఎదురుదాడికి దిగింది.

Advertisement

Next Story