నెతన్యాహు రాజీనామా చేయాలి: ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు

by samatah |
నెతన్యాహు రాజీనామా చేయాలి: ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెంటనే తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ దేశ రాజధాని జెరూసలెంలో లక్షలాది మంది ప్రజలు శనివారం రాత్రి నిరసన తెలిపారు. టెల్ అవీవ్, జెరూసలేం నగరాల్లో వీధుల్లోకి వచ్చి నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టెల్ అవీవ్‌లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో 16మంది నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు. హమాస్ చేతిలో ఉన్న బంధీల విడుదలతో పాటు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరాల్లోనూ నిరసనలు జరిగాయి. వీటిని మరింత ఉదృతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈజిప్టు రాజధాని కైరోలో ఆదివారం మరోసారి చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఈ ఆందోళనలు జరిగాయి. తాజాగా జరిగే చర్చలు గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, బందీలను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇజ్రాయెల్ అందుకు ఒప్పుకునే పరిస్థితిలో లేదని నెతన్యాహు పలుమార్లు వెల్లడించారు. దీంతో బంధీల విడుదలకు ఆయనే ప్రధాన అడ్డంకిగా మారారని పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

గతేడాది అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ గ్రూపులు చేసిన దాడితో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైంది. హమాస్ టెర్రరిస్టులు దాదాపు 1,200 మందిని చంపారు. 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఇంకా 130 మందికి పైగా ప్రజలు హమాస్ చెరలో బంధీలుగా ఉన్నారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 32000 మందికి పైగా మరణించగా..గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed