ఆ బావి కారణంగా బనారస్, లండన్ మళ్లీ కనెక్ట్ అయ్యాయి..

by Sumithra |
ఆ బావి కారణంగా బనారస్, లండన్ మళ్లీ కనెక్ట్ అయ్యాయి..
X

దిశ, పీచర్స్ : స్వాతంత్రం రాక ముందు బ్రిటిష్ అధికారులు భారతదేశ పౌరుల పై అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. ఇంత జరిగినా ఒక బ్రిటీష్ అధికారి తన పౌరుల కష్టాలను వివరించినప్పుడు బనారస్ మహారాజు వెంటనే సహాయం అందించాడు. అక్కడ బ్రిటిష్ అధికారి చేయవలసిన పని భారతదేశ మహారాజు ద్వారా జరిగింది. లండన్ సమీపంలో ఉన్న మహారాజా బావి ఈ సహాయానికి సాక్షి.

19వ శతాబ్దంలో లండన్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని చిల్టర్న్ హిల్స్ సమీపంలోని స్టోక్ రో అనే చిన్న గ్రామంలో నీటి కొరత ఏర్పడింది. మురికి చెరువులు, బురద గుంటల్లో నిల్వ ఉన్న నీటిని పౌరులు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈస్టిండియా కంపెనీ అధికారి ఎడ్వర్డ్ ఆండర్సన్ రీడ్ ఈ విషయాన్ని బనారస్ మహారాజా ఈశ్వరీ నారాయణ్ సింగ్‌తో చెప్పినప్పుడు ఆయన చలించిపోయాడు. పౌరులకు సహాయం చేయడానికి అతను తన ఖజానాను అందించాడు.

368 అడుగుల లోతున్న బావిని బకెట్‌తో తవ్వారు..

బ్రిటీష్ గ్రామంలో బావిని నిర్మించడానికి మహారాజా ఈశ్వరి భారీ మొత్తాన్ని ఇచ్చాడు. బావి నిర్మాణ పనులు 1863 మార్చి 10న ప్రారంభమయ్యాయి. బకెట్లతో బావిలోని మట్టిని తొలగించారు. ఒక సంవత్సరంలోనే పౌరులకు మంచినీటిని అందించేందుకు మహారాజా బావి సిద్ధం అయ్యింది. దీని వెడల్పు 1.2 మీటర్ల, లోతు 368 అడుగులు. ఇది కుతుబ్ మినార్ కంటే లోతుగా ఉంది. దీని ఎత్తు 238 అడుగులు. చాలా లోతుగా ఉండడం వల్ల ఆ బావి నీరు ఎంతో శుభ్రంగా ఉండేది. ఈ బావి నుండి ఒక బకెట్ నీటిని లాగడానికి 10 నిమిషాలు పట్టేదని చరిత్ర చెబుతుంది.

ఈ బావి తవ్వకానికి నేటి కాలంలో సుమారు రూ.40 లక్షల భారీ వ్యయం అయ్యేది. కొన్ని సంవత్సరాల తర్వాత 1871 లో బావి పైన బంగారు ఏనుగు బొమ్మను చెక్కారు. మహారాజు బావి నిర్మాణానికి విరాళం ఇవ్వడమే కాకుండా, బావి నిర్వహణ, సంరక్షణ కోసం చెర్రీస్ సాగు కోసం భూమిని కూడా అందించాడు. ఆ రీడ్ చెర్రీ తోటకు మహారాజు పేరు ఇష్రీ బాగ్ అని పేరు పెట్టారు.

జీవితం మారింది..

ఏంజెలా స్పెన్సర్-హార్పర్ 'డిప్పింగ్ ఇంటు ది వేల్స్' పుస్తకంలో ఈ బావి ఆ ప్రాంతంలోని ప్రజల జీవన విధానాన్ని మార్చిందని రచయిత రాశారు. బావి నిర్మాణం కాకముందు గ్రామంలో స్వచ్ఛమైన నీటి వనరులు లేవు. మురికి నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడ్డారు. ఆ బావి 70 ఏళ్లపాటు ప్రజల దాహాన్ని తీర్చుకుంటూ వచ్చింది. మహారాజు తన జీవిత కాలంలో బావి నిర్వహణకు డబ్బు సహాయం చేశారు. సంక్షోభ సమయాల్లో గ్రామస్తులను ఆదుకోవడానికి కూడా చర్యలు తీసుకున్నాడు. అయితే మహారాజు, బ్రిటీష్ అధికారి మరణానంతరం ఈ బావి నిర్వహణ సరిగా లేదు.

బనారస్, లండన్ మళ్లీ కనెక్ట్ అయ్యాయి..

క్వీన్ ఎలిజబెత్ భారతదేశ పర్యటన సందర్భంగా (1961) బనారస్ వచ్చినప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ ఏర్పడ్డాయి. ఇక్కడ అప్పటి మహారాజు రాణికి బావి సంబంధించిన పాలరాతి నమూనాను బహుమతిగా ఇచ్చాడు. దీని తరువాత 8 ఏప్రిల్ 1964న , ప్రిన్స్ ఫిలిప్, మహారాజా ప్రతినిధులతో కలిసి స్టోక్ రో గ్రామానికి చేరుకున్నారు. మహారాజా ప్రతినిధులు తమతో పాటు బనారస్ నుండి పవిత్ర గంగాజలాన్ని తీసుకువచ్చారు. వేడుకగా ఈ గంగాజలాన్ని బావి నీటిలో కలపడం ద్వారా బనారస్, లండన్ మధ్య అనుబంధం మరోసారి బలపడింది.

Advertisement

Next Story