150 మందిని బలిగొన్న ఉగ్రవాదులంతా ఆ దేశస్తులే.. ఐసిస్ వీడియో వైరల్

by Hajipasha |   ( Updated:2024-03-24 18:54:56.0  )
150 మందిని బలిగొన్న ఉగ్రవాదులంతా ఆ దేశస్తులే.. ఐసిస్ వీడియో వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా రాజధాని మాస్కోపై జరిగిన ఘోరమైన ఉగ్రదాడి ఘటనతో ముడిపడిన మరింత సమాచారం తాజాగా ఆదివారం వెలుగుచూసింది. దాదాపు 150 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు దాడికి వెళ్లే ముందు.. మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌ లోపలికి ప్రవేశించాక దిగిన ఫొటోలు, వీడియోలను ఐసిస్- ఖొరాసన్ ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో ఉగ్రవాదుల మొహాలు, గొంతులను గుర్తుపట్టలేని విధంగా బ్లర్ చేశారు. కాన్సర్ట్ హాల్‌ లోపలికి ప్రవేశించాక ఉగ్రవాదులు కాల్పులు జరపడం.. అక్కడున్న జనంతో భయంతో పరుగులు తీయడం ఓ వీడియోలో కనిపించింది. ఇక ఓ బాధిత వ్యక్తి కాన్సర్ట్ హాల్‌‌లో ఉగ్రవాదుల నుంచి తప్పించుకొని పారిపోతూ తీసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఈ వీడియో తీసిన వ్యక్తి ఎలాగోలా కాన్సర్ట్ హాల్ నుంచి ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది. ఉగ్రవాదులకు కనిపించకుండా ఉండేందుకు దాదాపు 28 మంది కాన్సర్ట్ హాల్‌‌లోని ఓ టాయిలెట్‌లో దాక్కోగా.. ఉగ్రవాదులు గుర్తించి కాల్చి చంపారు. ఆ ఒక్క టాయిలెట్‌ నుంచే 28 డెడ్ బాడీస్ బయటపడ్డాయని తెలిసింది. ఇక ఈ భవనంలోని అత్యవసర మెట్ల దారిలో మరో 14 డెడ్ బాడీస్ లభ్యమయ్యాయి.

సంతాప దినం..

ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో యావత్ రష్యా దేశం ఆదివారం రోజు అధికారిక సంతాప దినాన్ని పాటించింది. చనిపోయిన వారికి యావత్ దేశ ప్రజలు నివాళులర్పించారు. మాస్కో శివార్లలోని క్రోకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌ వద్దకు పెద్దసంఖ్యలో ప్రజలు బొకేలు, టెడ్డీ బేర్‌లతో చేరుకున్నారు. వాటిని హాల్ పరిసరాల్లో నేలపై ఉంచి చనిపోయిన వారికి నివాళులు అర్పించారు.

ఉగ్రవాదులు ఉక్రెయిన్‌‌కు పరారీకి యత్నించారు : పుతిన్‌

‘‘ఈ దాడులు జరిపిన ఉగ్రవాదులు.. ఏదో ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయన్నట్టుగా నేరుగా ఉక్రెయిన్ బార్డర్ వైపుగా వెళ్లడాన్ని మా సైన్యం గుర్తించింది’’ అని పుతిన్ తెలిపారు. అయితే తమ దేశంపై సందేహం వ్యక్తం చేయడం ఆపాలని పుతిన్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సూచించారు. ఇక రష్యాలో ఉగ్రదాడికి పాల్పడిన వాళ్లలో చాలామంది తజకిస్తాన్ దేశస్తులు ఉన్నారని తేలింది. నిరుద్యోగులుగా ఉన్న దాదాపు 11 మంది తజకిస్తాన్ యువకులకు భారీగా డబ్బును ఆశగా చూపించి ఐసిస్‌లోకి చేర్చుకొని ఉగ్రవాదులుగా మార్చినట్లు వెల్లడైంది. ఈనేపథ్యంలో తజకిస్తాన్ సర్కారు అలర్ట్ అయింది. ఉగ్రవాదులకు మతం కానీ, దేశం కానీ ఉండదని స్పష్టంచేసింది. ఉగ్రవాదులతో తమ సర్కారుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. తజకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ బార్డర్‌లోనే ఐసిస్ - కే ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.


Advertisement

Next Story

Most Viewed