ఇంకెంతకాలం వేచి ఉండాలి: యూఎన్ఎస్సీలో సంస్కరణలపై భారత్

by samatah |
ఇంకెంతకాలం వేచి ఉండాలి: యూఎన్ఎస్సీలో సంస్కరణలపై భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీలో) తక్షణ సంస్కరణలు అవసరమని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే పావు శతాబ్దం గడిచిందని..సంస్కరణలకు ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నించారు. న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ఎస్సీ 75వ సెషల్‌లో ఆమె ప్రసంగించారు. యూఎన్ఎస్సీలో వెంటనే నూతన సంస్కరణలు తీసుకురావాలని నొక్కి చెప్పారు. సంస్కరణలపై దశాబ్దానికి పైగా చర్చలు కొనసాగుతున్నాయని.. ప్రపంచం, మన భవిష్యత్ తరాలు ఇకపై వేచి ఉండలేవని తెలిపారు. వచ్చే ఏడాది ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం, ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న కీలకమైన శిఖరాగ్ర సమావేశం వంటి ముఖ్యమైన మైలురాళ్లను జరుపుకోవడానికి ముందే యూఎన్ఎస్సీలో సంస్కరణలను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని సూచించారు.

వీటో పవర్‌తో అడ్డుకోవద్దు

‘చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దాలనే డిమాండ్ బలపడుతోంది. భవిష్యత్ తరాల గొంతులను దృష్టిలో ఉంచుకుని సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకురావాలి. లేకుంటే యూఎన్ఎస్సీ సక్రమంగా నడిచే పరిస్థితి నెలకొనదు’ అని తెలిపారు. యతాతథ స్థితిని కొనసాగించడం సరికాదని తేల్చిచెప్పారు. భద్రతా మండలి విస్తరణను శాశ్వత సభ్యులకు మాత్రమే పరిమితం చేయడం వల్ల దాని కూర్పులో అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతినిధులందరూ సమాన భాగస్వామ్యం కలిగి ఉండాలని తెలిపారు. వీటో అధికారం ఉన్న దేశాలు ఈ సంస్కరణలను అడ్డుకోకూడదని పిలుపునిచ్చారు. సమీక్ష సమయంలో నిర్ణయం తీసుకునే వరకు శాశ్వత సభ్య దేశాలు వీటోను ఉపయోగించొద్దని సూచించారు.

భారత్‌కు బ్రిటన్ మద్దతు

యూఎన్ఎస్సీలో సంస్కరణలకు భారత్ చేసిన సూచనలకు బ్రిటన్ మద్దతు తెలిపింది. ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేటి ప్రపంచానికి మరింత ప్రాతినిధ్యం వహించాలి. ఆ సంస్థ విస్తరణకు మద్దతిస్తాం. మరింత వైవిధ్యమైన, సమర్థవంతమైన కౌన్సిల్‌ను చూడాలనుకుంటున్నాం. జీ4 దేశాలైన బ్రెజిల్, జర్మనీ, భారత్, జపాన్ శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండాలి’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. కాగా, యూఎన్ఎస్సీ అనేది ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాల్లో ఒకటి. అంతర్జాతీయంగా శాంతి, భద్రతా పరిస్థితులను నిర్థారించే బాధ్యతను కలిగి ఉంటుంది. ఐక్యరాజ్యసమితిలో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి ఈ సంస్థ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 15దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed