Hamas group: ఇజ్రాయెల్‌తో చర్చలకు సిద్ధం.. ప్రకటించిన హమాస్

by vinod kumar |
Hamas group: ఇజ్రాయెల్‌తో చర్చలకు సిద్ధం.. ప్రకటించిన హమాస్
X

దిశ, నేషనల్ బ్యూరో:11 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు తన డిమాండ్లపై మొండిగా ఉన్న హమాస్ గ్రూప్ గాజాలో కాల్పుల విరమణను కోరుకుంటోంది. ఈ విషయమై ఇజ్రాయెల్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే గతంలో అమెరికా సూచించిన ప్రతిపాదన ఆధారంగా మాత్రమే కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని, కొత్త షరతులు ఉండకూడదని పేర్కొంది. ఈ మేరకు తాజాగా హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విరమణపై చర్చలు జరుపుతున్న తమ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా దోహాలో ఖతర్ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీ, ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కమెల్‌తో చర్చించినట్టు వెల్లడించింది.

అమెరికా తరపున విలియమ్స్ బర్న్స్ చర్చల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇటీవల మాట్లాడుతూ.. రాబోయే కొద్ది రోజుల్లో మరింత వివరణాత్మక కాల్పుల విరమణ ప్రతిపాదన చేయనున్నట్లు తెలిపారు. కాగా, జూన్‌లో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ పలు ప్రతిపాదనలు చేశారు. ఇజ్రాయెల్ బందీల విడుదలకు బదులుగా మూడు దశల కాల్పుల విరమణను ప్రకటించారు. దీనిపై అప్పట్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఫిలడెల్ఫియా కారిడార్ సమస్య వల్ల చర్చలు నిలిచిపోయాయి. అయితే హమాస్ తాజా ప్రతిపాదనపై ఇజ్రాయెల్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.

గాజాపై ఇజ్రాయెల్ దాడి: 34 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. బుధవారం రాత్రి నిరాశ్రయులపై ప్రజలకు పునరావాసం కల్పిస్తున్న ఓ పాఠశాల, ఇళ్లపై వైమాణిక దాడి చేసింది. ఈ ఘటనలో 19 మంది మహిళలు, పిల్లలతో సహా 34 మంది మరణించారు. అలాగే ఐక్యరాజ్యసమితికి చెందిన ఆరుగురు సిబ్బంది సైతం మరణించినట్టు యూఎన్ఓ ధ్రువీకరించింది. కారుపై జరిగిన మరో దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్టు ఇజ్రాయల్ సైన్యం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed