‘కాల్పుల విరమణ’కు హమాస్ ఓకే.. కుదిరిన డీల్ వివరాలివీ

by Hajipasha |
‘కాల్పుల విరమణ’కు హమాస్ ఓకే.. కుదిరిన డీల్ వివరాలివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈజిప్టు-ఖతర్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ ఎట్టకేలకు సోమవారం ఓకే చెప్పింది. గాజా సరిహద్దులోని అత్యంత జనసమ్మర్ధ ప్రాంతం రఫాపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడికి సిద్ధమవుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్న రఫా ప్రాంతంలో దాదాపు 15 లక్షల మందికిపైగా సామాన్య పాలస్తీనా ప్రజలు నివసిస్తున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి దిగితే వేలాది మంది ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. ఈతరుణంలో ఇజ్రాయెల్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికకు హమాస్ పచ్చజెండా ఊపడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ కాల్పుల విరమణ ప్రణాళిక 42 రోజులు చొప్పున మూడు విడతల్లో అమలవుతుందని అంటున్నారు. ఈ వ్యవధిలో గాజాలో కాల్పుల విరమణ, గాజా ప్రాంత పునర్నిర్మాణం, వలస వెళ్లిన వారు తిరిగి స్వస్థలాలకు చేరుకునే వెసులుబాటు కల్పించడం, ఖైదీల పరస్పర మార్పిడి వంటివన్నీ జరుగుతాయని చెబుతున్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు తాము అనుకూలంగా ఉన్న విషయాన్ని స్వయంగా హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియా ఫోన్ కాల్‌లో ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థానీ, ఈజిప్టు ఇంటెలిజెన్స్ మంత్రి అబ్బాస్ కమెల్‌‌కు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed