Kamala Harris : కమలా హ్యారిస్‌కు బరాక్ ఒబామా మద్దతు

by Hajipasha |   ( Updated:2024-07-26 13:33:49.0  )
Kamala Harris : కమలా హ్యారిస్‌కు బరాక్ ఒబామా మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి వైదొలగడంతోో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మిగిలారు. ఆమెకు ఇప్పటికే చాలామంది డెమొక్రటిక్ పార్టీ కీలక నేతలు మద్దతు ప్రకటించగా.. మాజీ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా శుక్రవారం సంఘీభావం తెలిపారు. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలవడానికి తాను, తన సతీమణి మిచెల్‌ ఒబామా చేయగలిగినదంతా చేస్తామని బరాక్ ఒబామా ప్రకటించారు. ఈమేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘ఈ వారం ప్రారంభంలో నేను, మిచెల్ కలిసి కమలకు కాల్ చేశాం. ఆమె అమెరికాకు అధ్యక్షురాలైతే బాగుంటుందని చెప్పాం. మా తరఫున పూర్తి మద్దతు అందిస్తామని తెలిపాం’’ అని బరాక్ ఒబామా వివరించారు. ఇక బరాక్ ఒబామాతో తన ఫోన్ కాల్‌కు సంబంధించిన ఒక వీడియోను కమలా హ్యారిస్ శుక్రవారం మధ్యాహ్నం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఆ ఫోన్ కాల్‌లో ఒబామా దంపతులకు కమలా హ్యారిస్ ధన్యవాదాలు తెలిపారు. వారి మద్దతుతో ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆగస్టు నెలలో చికాగోలో డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌ జరగనుంది. అంతకంటే ముందే అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం నామినేషన్ దాఖలు చేయాలని కమలా హ్యారిస్ భావిస్తున్నారు.

కమలా హ్యారిస్‌తో నెతన్యాహు భేటీ

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం రోజు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై ఇరువురి మధ్య ప్రధాన చర్చ జరిగింది. ‘‘ఇజ్రాయెల్ ఆత్మరక్షణ వాదాన్ని మేం సమర్ధిస్తాం. అందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. అదే సమయంలో పాలస్తీనా పౌరులు పడుతున్న బాధల గురించి మౌనంగా ఉండలేం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగాలి. ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేయాలి’’ అని నెతన్యాహూతో చర్చల సందర్భంగా కమల పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed