Foreign diplomats: పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. 11 దేశాల దౌత్య వేత్తలకు తప్పిన ప్రమాదం

by vinod kumar |
Foreign diplomats: పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. 11 దేశాల దౌత్య వేత్తలకు తప్పిన ప్రమాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో11 దేశాల దౌత్యవేత్తలే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాయబారులు మింగోరాలో నిర్వహించిన చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో పాల్గొని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని స్వాత్ జిల్లా నుంచి మలమ్ జబ్బాకు వెళ్తుండగా వారి కాన్వాయ్‌కు రక్షణగా ఉన్న పోలీసు వ్యాన్‌పై టెర్రరిస్టులు దాడి చేశారు. ఉగ్రవాదులు రిమోట్‌ కంట్రోల్‌ బాంబుతో వ్యాన్‌ను పేల్చివేసినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పేలుడులో ఓ పోలీసు మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

దౌత్యవేత్తల బృందమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పోలీసులు ధ్రువీకరించారు. అయితే రాయబారులందరూ క్షేమంగా ఉన్నారని, వారిని ఇస్లామాబాద్‌కు తరలించినట్టు తెలిపారు. కాన్వాయ్‌లో రష్యా, వియత్నాం, బోస్నియా, ఇథియోపియా, రువాండా, జింబాబ్వే, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, కజకిస్థాన్, పోర్చుగల్‌లకు చెందిన దౌత్యవేత్తలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతి చెందిన పోలీసును బుర్హాన్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ఈ ఘటనను పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన పోలీసు అధికారికి నివాళులర్పించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఈ దాడికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. ఉగ్రవాదులను నియంత్రించడంలో కట్టుబడి ఉన్నామని, ఈ తరహా చర్యలను ఉపేక్షించేది లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, ఇటీవల పాక్‌లో ఉగ్రదాడుల సంఖ్య భారీగా పెరిగింది. జూలైలో 38 ఉగ్రదాడులు జరగగా.. ఆ సంఖ్య ఆగష్టులో 59కి పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed