44 ఏళ్ల తర్వాత చైనా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

by Y. Venkata Narasimha Reddy |
44 ఏళ్ల తర్వాత చైనా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
X

దిశ, వెబ్ డెస్క్ : పసిఫిక్‌ మహాసముద్రంలో చైనా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతగా పరీక్షించింది. 44 ఏళ్ల తర్వాత చైనా సముద్రంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. 1980లో మొదటిసారి ప్రయోగించింది. అప్పటి నుంచి అణ్వాయుధ పరీక్షలు భూఉపరితలం పైకి నిర్వహించిన చైనా మళ్ళీ ఇన్నా్ళ్ళకు సముద్రంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం విశేషం. పీఎల్‌ఏ రాకెట్‌ ఫోర్స్‌ ఈ ఖండాంతర క్షిపణి డమ్మీ వార్‌హెడ్‌ను అమర్చి స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8.44కు ప్రయోగించినట్లు చైనా రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఖండాంతర క్షిపణి ముందుగా నిర్ణయించిన లక్ష్యానికి విజయవంతంగా చేరుకుందని తెలిపింది. 'ఈ ప్రయోగం మా దేశ దళాల శిక్షణ, ఆయుధశక్తి, నిర్ణీత లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వంటి అంశాలను విశ్లేషించేందుకు ఉపయోగపడుతుందని చైనా ప్రకటించింది. ఖండాంతర క్షిపణి ప్రయోగంపై సంబంధింత దేశాలకు ముందే సమాచారం అందించామని, ఏ దేశానికి వ్యతిరేకంగా నిర్దేశించినది కాదు' అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో చెప్పింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ ప్రయోగం జరిగిందని తెలిపింది. దేశ సైనిక దళాల వార్షిక శిక్షణ ప్రణాళికల్లో ఇది సాధారణంగా జరిగే విషయమేనని చెప్పింది.

ఇక ఈ నెల ప్రారంభంలోనే ఉత్తర కొరియా తూర్పు సముద్రం వైపు అనేక స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను చైనా ప్రయోగించింది. ఇటీవల కాలంలో ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో క్షిపణి కార్యకలాపాలు ఊపందుకున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో చైనా తాజా పరీక్ష ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం చైనా దగ్గర అణుసామర్థ్యాలు స్థాయికి మించే ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు చైనా మాత్రం తొలుత అణ్వస్త్రాల వినియోగానికి తాము వ్యతిరేకమని పేర్కొంది. ప్రస్తుతం బీజింగ్ అమ్ములపొదిలో దాదాపు 500 అణు వార్ హెడ్లు ఉన్నాయి. దీంతోపాటు 350 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు(ఐసీబీఎం) ఉన్నట్లు నిపుణుల అంచనా. 2030 నాటికి అణు వార్ హెడ్ ల సంఖ్య 1,000 దాటి పోవచ్చని అమెరికాలోని పెంటగాన్ అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed