UNSC: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే: బ్రిటన్ ప్రధాని

by Harish |   ( Updated:2024-09-27 08:15:18.0  )
UNSC: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే: బ్రిటన్ ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మెక్రాన్ మద్దతు ప్రకటించగా, తాజాగా బ్రిటన్ కూడా భారత్ తరఫున నిలిచింది. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే అని ఆ దేశ ప్రధాని కైర్ స్టార్మర్ అన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ సాధారణ చర్చలో స్టార్మర్ మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. సభ్య దేశాల సంఖ్య తక్కువగా ఉండటం వలన కొన్ని ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా భద్రతా మండలిని విస్తరించాలని, దేశాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

బ్రెజిల్, ఇండియా, జపాన్, జర్మనీలను శాశ్వత సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యాన్ని చూడాలనుకుంటున్నాము. ఎన్నికైన సభ్యులకు కూడా ఎక్కువ సీట్లు ఉండాలని ఆయన అన్నారు. అంతకుముందు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ మద్దతు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రసంగిస్తూ ప్రపంచ శాంతి, అభివృద్ధికి, సంస్థల్లో సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పిన కొద్ది రోజుల తర్వాత మెక్రాన్ నుంచి వ్యాఖ్యలు వచ్చాయి. గత వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా మద్దతు తెలిపారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed