Bangladesh : రేపు బంగ్లాదేశ్‌లో కొలువుతీరనున్న మధ్యంతర ప్రభుత్వం

by Hajipasha |   ( Updated:2024-08-07 14:48:22.0  )
Bangladesh : రేపు బంగ్లాదేశ్‌లో కొలువుతీరనున్న మధ్యంతర ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం గురువారం కొలువుతీరనుంది. మహ్మద్ యూనుస్ ప్రధాన సలహాదారుగా ఆగస్టు 8న రాత్రి 8 గంటలకు కొత్త సర్కారులోని కీలక సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈవిషయాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమా బుధవారం వెల్లడించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. మహ్మద్ యూనుస్ సారథ్యంలోని ప్రభుత్వ సలహా మండలిలో 15 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. ప్రజాస్వామిక ప్రక్రియ ద్వారా బంగ్లాదేశ్‌ను యూనుస్ ముందుకు నడిపిస్తారని, దీనిపై ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారని ఆర్మీ చీఫ్ చెప్పారు. యూనుస్ పాలనతో బంగ్లాదేశ్ ప్రయోజనం పొందుతుందని వకారుజ్జమా ఆశాభావం వ్యక్తం చేశారు.

బంగ్లాను సమస్యల నుంచి గట్టెక్కించాలి : యూనుస్

ఇప్పటివరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉన్న మహ్మద్ యూనుస్ బంగ్లాదేశ్‌కు బయలుదేరే ముందు బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘నేను మా దేశానికి బయలుదేరుతున్నాను. బంగ్లాదేశ్‌ను సమస్యల నుంచి గట్టెక్కించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘హింసతో మనం ఏదీ సాధించలేం. హింసా మార్గంలో పయనిస్తే అన్నీ నాశనం అవుతాయి. శాంతి మార్గంలోనే మనం అభివృద్ధిని సాధించగలం’’ అని యూనుస్ తెలిపారు.

ఆ కేసులో యూనుస్‌కు ఊరట

మరోవైపు కార్మికుల వ్యవహారంతో ముడిపడిన ఓ కేసులో మహ్మద్ యూనుస్‌కు ఊరట లభించింది. ఆయనను ఆ కేసులో దోషిగా ప్రకటిస్తూ ఓ బంగ్లాదేశ్ కోర్టు తీర్పు వెలువరించింది. అంతకుముందు అదే కేసులో దిగువ కోర్టు యూనుస్‌ను దోషిగా తేల్చి ఆరునెలల జైలుశిక్ష విధించింది. అయితే వెంటనే బెయిల్ కోసం యూనుస్ అప్పీల్ చేసినా అది పెండింగ్‌లో ఉండిపోయింది. గత షేక్ హసీనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అలా చేయించిందనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. కార్మికుల వ్యవహారంతో ముడిపడిన కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలోనే యూనుస్ బంగ్లాదేశ్ విడిచి ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు.

Advertisement

Next Story

Most Viewed