రూ.25 లక్షల కోట్ల సంపద.. వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ

by Hajipasha |   ( Updated:2024-01-19 16:19:54.0  )
రూ.25 లక్షల కోట్ల సంపద.. వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ
X

దిశ, నేషనల్ బ్యూరో : రూ.25 లక్షల కోట్ల సంపదతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌ రాజ కుటుంబం రికార్డులకు ఎక్కింది. 2023 సంవత్సరంలో ప్రపంచంలోని సంపన్న కుటుంబాల జాబితాలో వాల్‌మార్ట్ అధినేత వాల్టన్‌కు చెందిన కుటుంబాన్ని దాటేసింది. యూఏఈ రాజ కుటుంబం పెద్ద.. షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌. వీరు మొత్తం 18 మంది సోదరులు, 11 మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌‌కు తొమ్మిది మంది సంతానం, 18 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. బ్రిటీష్ రాజకుటుంబంతో సరిసమానమైన ఆస్తులు యూఏఈ రాయల్ ఫ్యామిలీకి ఉన్నాయని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో 6 శాతం ఈ కుటుంబం ఆధీనంలోనే ఉన్నాయి. మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌ పేరు వినే ఉంటారు. దీన్ని యూఏఈ రాజ కుటుంబం 2008లో రూ.2,122 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌, ప్రముఖ సింగర్ రిహన్నా బ్యూటీ బ్రాండ్‌ ఫెంటీతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లో వీరికి వాటాలు ఉన్నాయి. వీరి కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఆదాయం గత ఐదేళ్లలో 28,000 శాతం పెరగడం విశేషం.


రూ.4వేల కోట్ల రాజ భవనం..

ఈ రేంజ్‌లో ఆస్తిపాస్తులున్న యూఏఈ రాజ కుటుంబం నివసించే భవంతి ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. అబుధాబిలోని ఖసర్ అల్‌ వతన్ రాజ భవనంలో ఈ ఫ్యామిలీ నివసిస్తుంది. యూఏఈలో వారికున్న ఎన్నో భవనాల్లో ఇదే అతి పెద్దది. దీని సైజు అమెరికా రక్షణ శాఖకు చెందిన కార్యాలయం పెంటగాన్‌ కంటే మూడు రెట్లు ఎక్కువ. 94 ఎకరాల్లో ఈ ప్యాలెస్ ఉంటుంది. దీని విలువ దాదాపు రూ.4,078 కోట్లు. ఈ ప్యాలెస్ డోమ్ 37 మీటర్ల వెడల్పు ఉంటుంది. లండన్‌, ప్యారిస్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రాయల్ ఫ్యామిలీకి ఆస్తులున్నాయి. వేల కోట్లు విలువ చేసే ప్రైవేటు నౌకలు, ప్రైవేటు విమానాలు కూడా ఈ కుటుంబానికి ఉన్నాయి. దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తమ్ముడు షేక్ హమ్మాద్ బిన్ హమ్దన్ అల్ నహ్యాన్ వద్ద 700కుపైగా కార్ల కలెక్షన్‌ ఉంది. బుగాటి, లంబోర్గిని, మెర్సిడెస్‌ బెంజ్‌ బ్రాండ్‌ల కార్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed