యూకే​ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ.. లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ

by Ramesh N |
యూకే​ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ.. లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం బ్రిటన్‌లోనూ ఎన్నికల హడావిడి మొదలైంది. అయితే బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణవాసి బరిలో నిలిచారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా (ప్రస్తుత సిద్దిపేట) కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదరు నాగరాజు లేబర్‌ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ లేబర్‌ పార్టీ తమ పార్లమెంటరీ కాండిడేట్‌గా నాగరాజు పేరును తాజాగా ప్రకటించింది. నార్త్‌ బెడ్‌ ఫోర్డ్‌ షైర్‌ ‘బౌండరీకమిషన్‌’ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి దిగారు.

మిడిల్ క్లాస్ నుంచి యూకే బరిలో..

శనిగరం గ్రామంలో మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన హనుమంతరావు- నిర్మలా దేవి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్‌ లండన్‌లో పాలనాశాస్త్రంలో ఆయన పీజీ చేశారు.మరోవైపు (ఏఐ) ఆర్టిఫిషియల్‌ ఇంటె లిజెన్స్‌ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన ఐ పాలసీ ల్యాబ్స్‌ అనే థింక్‌ట్యాంక్‌ను నెలకొల్పారు.ఇంటర్నేషనల్ స్పీకర్, రచయితగా మంచి ఆయన పేరు ఉంది.

యూకేలోనే స్కూల్‌ గవర్నర్‌గా, వాలంటీర్‌గా, రాజకీయ ప్రచారకుడిగా పదేళ్ళుగా ఇంటింటికీ ప్రచారంతో అక్కడి ప్రజల్లో పట్టు సాధించారు. బ్రిటన్ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నెల జరిగిన కౌన్సిలర్‌, రాష్ట్ర మేయర్‌ ఎన్నికలోనూ లేబర్‌ పార్టీ విజయం సాధించింది. దీంతో తెలంగాణ బిడ్డ ఉదరు నాగరాజు కూడా బ్రిటన్‌ పార్ల‌మెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా ఘన‌విజయం సాధిస్తారని లండన్‌ ప్రతినిధి వీఎంరెడ్డి మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో 68 శాతం లేబర్‌ పార్టీ గెలవబోతుందని ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలక్టో రల్‌ కాల్కులస్‌ అంచన వేసింది. దీంతో తెలుగు బిడ్డ గెలుపు ఖాయమని చర్చనీయాంశంగా మారింది.

భారత్‌లో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ ఏడాదిలోనే బ్రిటన్‌, అమెరికాలోనూ ఎన్నికలు జరగనున్నాయి. రష్యా -ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్‌, అమెరికా ఎన్నికలపై ప్రపంచ దేశాల దృష్టి పడింది.

Advertisement

Next Story

Most Viewed