Israel-Hamas: గాజాలో 40 వేలు దాటిన మరణాలు

by Harish |
Israel-Hamas: గాజాలో 40 వేలు దాటిన మరణాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొంత కాలంగా జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భాగంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచ దేశాలు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికి కూడా ఇజ్రాయెల్ గాజా నగరంపై దాడులు మాత్రం ఆపడం లేదు. తాజాగా గురువారం గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, గత 24 గంటల్లో 40 మంది చనిపోయిన వారితో కలిపి ఇప్పటి వరకు ఈ యుద్ధంలో కనీసం 40,005 మంది మరణించారని పేర్కొంది. అలాగే, మరో 92,401 మంది గాయపడ్డారని డేటాలో వెల్లడైంది.

ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో చాలా భవనాలు ధ్వంసం అయ్యాయి. శిథిలాల క్రింద వేల మంది చనిపోయారు. బాంబు దాడులు మొత్తం పాలస్తీనా కుటుంబాలను చంపేశాయి. స్మశానవాటికలు నిండిపోవడంతో చనిపోయిన వారిని వారి కుటుంబాలు రోడ్ల పక్కన, వారి ఇళ్ల మెట్ల క్రింద. మరణించిన చోటే పూడ్చివేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువగా చనిపోయారు. ఇప్పటికే తీవ్ర గాయాలతో వందలాది చిన్నారులు ఆసుపత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

తాత్కాలిక శిబిరాలు చాలా వరకు నిండిపోయాయి. దాంతో అక్కడ ఆహారం, ఔషధాలు, మంచినీటి కొరత ఏర్పడింది. ఇజ్రాయెల్ దాడులతో సాధారణ ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతుండటంతో పాటు, చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. గాజా భూభాగం కరువు ప్రమాదంతో ఉంది. మొత్తం 4,95,000 మందికి పైగా ఉన్న జనాభాలో ఐదవ వంతు కంటే ఎక్కువ మంది ఆకలితో అలమటిస్తున్నారు. రాబోయే నెలల్లో ఆకలి సమస్య అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Next Story