ముంచెత్తిన వర్షాలు.. 37 మంది మృతి.. వందలాది మందికి గాయాలు

by Hajipasha |
ముంచెత్తిన వర్షాలు.. 37 మంది మృతి.. వందలాది మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌ను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 48 గంటల్లో కురిసిన వర్షాలకు 37 మంది చనిపోయారు. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయి, కొండచరియలు విరిగిపడి, చెట్లు కూలి, విద్యుదాఘాతం సంభవించిన ఘటనల్లో వందలాది మందికి గాయాలయ్యాయి. ఈ వర్షాల ప్రభావం ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని వాయవ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో కనిపించింది. చనిపోయిన వారిలో 27 మంది ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌ వారే కావడం గమనార్హం. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రావిన్స్‌లో మరో 37 మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారు. నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఐదుగురు మరణించారు. దీని పరిధిలోని గ్రామాలన్నీ జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ టీమ్‌లు పడవలను ఉపయోగించాల్సి వచ్చింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్వాదర్‌ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఐదుగురు చనిపోయారు. కాగా, 2022లో పాకిస్తాన్‌లో అకాల వర్షాల వల్ల 1,800 మందికిపైగా మరణించారు.

Advertisement

Next Story

Most Viewed