ఉగ్రమూకల నెత్తుటి క్రీడ.. 143 మంది దుర్మరణం.. 150 మందికి గాయాలు

by Hajipasha |
ఉగ్రమూకల నెత్తుటి క్రీడ..  143 మంది దుర్మరణం.. 150 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా రాజధాని మాస్కో చిగురుటాకులా వణికింది. శుక్రవారం రాత్రి నగరంలో సంగీత కచేరీ జరుగుతున్న క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌ మృత్యుఘోషతో మార్మోగింది. ఎవరికీ అనుమానం రాకుండా సైనిక దుస్తుల్లో కాన్సర్ట్ హాల్‌లోకి ప్రవేశించిన నలుగురు సాయుధ దుండగులు జనంపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. బాంబులను చుట్టూ విసిరారు. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ 'ఫిక్నిక్' సంగీత కార్యక్రమం కాసేపట్లో ప్రారంభమవుతుందనగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ వేలాది మంది సంగీత ప్రియులు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని ఉరుకులు పరుగులు తీశారు. కొందరు ఏం చేయాలో అర్థం కాక కాన్సర్ట్‌ హాల్‌‌లోని సీట్ల వెనుక దాచుకున్నారు. ఇలా దాక్కున్న వారినీ వదలకుండా పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో గురిపెట్టి ఉగ్రవాదులు నెత్తుటేరును పారించారు. ఈ పాశవిక ఉగ్రదాడిలో 143 మంది చనిపోగా, దాదాపు 150 మందికిపైగా గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈవిషయాన్ని రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ వెల్లడించింది. చనిపోయిన వారిలో పిల్లలు, మహిళలు, ముసలివారు కూడా ఉన్నారని తెలిపింది.

బాంబుల ధాటికి కూలిపోయిన పైకప్పు

ఉగ్రవాదులు విసిరిన బాంబుల పేలుడు ధాటికి.. క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌ పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. భవనంలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది గంటల కొద్దీ శ్రమించి మంటలను ఆర్పాయి. ఇక కాల్పులు జరిపిన నలుగురు ఉగ్రవాదులతో పాటు మరో ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ వెల్లడించింది. ఈ ఘటన నేపథ్యంలో రష్యావ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు దేశంలో ఎలాంటి వేడుకలకు అనుమతి లేదని రష్యా నేషనల్‌ గార్డు ప్రకటించింది. ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది. మాస్కోలో ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్ స్పష్టం చేశారంటూ క్రెమ్లిన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రమేయం ఉండొచ్చనే ప్రచారం జరగడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. ఈ ఘటనతో ఉక్రెయిన్‌కు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాగా, గత 2 దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి.

దాడికి మాదే బాధ్యత: ఐసిస్-కే

ఈ ఉగ్రదాడికి తమదే బాధ్యత అని పేర్కొంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ - ఖొరాసన్(ఐసిస్ - కే) ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ దాడి ‘ఐసిస్-కే’ పనేనా ? మరేదైనా కోణం ఉందా ? అనేది తేలాల్సి ఉంది. ‘‘మాస్కో శివార్లలోని క్రాస్నోగోర్స్క్ ఏరియాలో పెద్ద సంఖ్యలో గుమిగూడిన క్రైస్తవులపై ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు దాడి చేశారు. వందలాది మందిని చంపి, గాయపరిచారు’’ అని ఐసిస్-కే తమ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 7న కూడా ఇస్లామిక్ స్టేట్ సెల్ మాస్కోలోని ఓ ప్రార్థనా మందిరంపై దాడికి యత్నించగా.. రష్యా అత్యున్నత భద్రతా సంస్థ అడ్డుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంపై పట్టు పెంచుకున్న కొద్ది రోజుల్లోనే ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం.

రెండువారాల క్రితమే అమెరికా వార్నింగ్ ఇచ్చినా..

రష్యాలో ఉగ్రదాడులు జరిగే ఛాన్స్ ఉందంటూ అమెరికా నిఘావర్గాలు రెండు వారాల క్రితమే హెచ్చరించాయట. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఐసిస్‌-ఖొరాసన్ ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందనే సమాచారాన్ని అప్పుడే రష్యా నిఘావర్గాలకు కూడా అమెరికా చేరవేసిందని అంటున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ రష్యాలోని అమెరికన్లకు అమెరికా సర్కారు నుంచి అడ్వైజరీ సైతం వచ్చిందని చెబుతున్నారు. ప్రత్యేకించి కాన్సర్ట్‌లు, ప్రజలు గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఆ అడ్వైజరీలో సూచించారట. అయితే దీన్ని రష్యా పెడచెవిన పెట్టినందు వల్లే మాస్కో ఉగ్రదాడి ఘటన జరిగిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

రష్యా ప్రజలకు అండగా ఉంటాం: మోడీ

మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారంతా త్వరగా ఈ బాధ నుంచి బయటపడాలని, క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో రష్యా ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలబడతామని మోడీ ప్రకటించారు. క్రాకస్ సిటీ హాల్‌పై జరిగిన దాడిని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఖండించారు. చైనా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందన్నారు. జాతీయభద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తామని ఆయన ప్రకటించారు. అమెరికా సైతం ఈదాడిని భయంకరమైనదిగా అభివర్ణించింది. ఈ ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది. యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ సహా అనేక దేశాలు ఉగ్రదాడి ఘటనను ఖండించాయి.

Advertisement

Next Story