- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆత్మగౌరవపతాక యూట్యూబ్ గంగవ్వ
దిశ, వెబ్‌డెస్క్: ‘సృష్టికి మూలం స్త్రీ.. ఆమె లేకపోతే జననం లేదు.. సృష్టిలో గమనం లేదు. అసలు సృష్టే లేదు’ అంటూ సినిమాల్లో, పుస్తకాల్లో స్త్రీ గురించి ఎంతో గొప్పగా కీర్తిస్తుంటారు. కానీ, స్త్రీల జనాభా మాత్రం రోజురోజుకూ తగ్గిపోతోంది. కారణం..సమాజంలో స్త్రీలపట్ల చిన్న చూపు. బాల్యం నుంచి మొదలు బామ్మయ్యే వరకు అనేక ఆంక్షలు, కట్టుబాట్లు. వేసుకునే డ్రెస్సు నుంచి కట్టుకునే భర్త వరకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛకు దూరం. ప్రతి విషయంలో ‘పురుషుల తర్వాతే మహిళలు’ అనే మాటలు చిన్నప్పటి నుంచే నూరిపోస్తూ.. వారిపై బలహీనులనే ముద్ర వేసేందుకు బలంగా ప్రయత్నిస్తోంది సమాజం. క్రమక్రమంగా కుటుంబ నేపథ్యాల్లో వస్తోన్న మార్పు.. ఇప్పుడిప్పుడే మహిళలు పురుషులతో సమానంగా రాణించేలా చేస్తున్నది. అయినా మహిళను అంగడి సరుకులా చిత్రీకరించే మార్కెట్ సూత్రీకరణలు..వారి ప్రభను తగ్గిస్తున్నాయి. వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. బడి నుంచి పని ప్రదేశం వరకు మహిళలు వేధింపులు ఎదుర్కోని చోటు లేదు. అత్యాచారాల వార్త వినని రోజు లేదు. ఇవేగాక.. కర్కశ భర్తల చేతిలో శారీరక హింసకు గురవుతూ పంటి బిగువన బాధను అనుభవిస్తున్న మహిళలకూ కొదవ లేదు. ఆ బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు.. శ్రమదోపిడీకి గురవుతున్నారు ఇలా అనేకానేకం. ఫర్ ఏ ఛేంజ్.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేస్తే.. ‘పిల్లి పులి అవుతుంది.. అబల సబల అవుతుంది’ అని నిరూపించిన కొందరు స్త్రీమూర్తుల్లో మన ‘గంగవ్వ’ ఒకరు.
మై విలేజ్ షోతో ప్రారంభమై..
తన యాస, భాషతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను అలరిస్తూ, యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ.. ఈ ప్రాంత ప్రజలకు ఆత్మీయబంధువులా మారింది. మై విలేజ్ షోతో సోషల్ మీడియాలో పరిచయమై ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న గంగవ్వ గొప్ప చదువులేం చదవలేదు. ఇన్నేళ్ల తన జీవన ప్రయాణంలో గొప్పగా జీవించనూ లేదు. చిన్నప్పటి నుంచి బాధలే. ఐదేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి..ఇద్దరు తమ్ముళ్లతో రోడ్డున పడింది. ఆమెను చేరదీసి తన కొడుక్కిచ్చి పెళ్లి చేసింది అమ్మలాంటి అత్త. కానీ, అక్కడా ఆమె పరిస్థితి అంతంత మాత్రమే. చిన్నప్పుడే పెళ్లి కావడం.. తల్లిదండ్రులు లేకపోవడం.. ఆ కష్టాలను దిగమింగే క్రమంలో ఆమెకు బాధ్యతలు పరిచయమయ్యాయి. కానీ, అందులో పది శాతం బాధ్యత కూడా భర్తకు రాలేదు. మందుకు బానిసై డబ్బులివ్వాలంటూ చిత్రహింసలు పెట్టేవాడు. ముగ్గురు పిల్లలు పుట్టినా.. వారిని పోషించేందుకు కాస్తో కూస్తో పని కూడా చేయలేదు. పైగా అప్పు చేసి మరీ దుబాయ్ చెక్కేశాడు. దీంతో పిల్లల భారం గంగవ్వపైనే పడింది. ఒళ్లు హూనమయ్యేలా పని చేసేది. రాత్రనకా.. పగలనకా… పని చేస్తూనే ఉండేది. ఇద్దరు ఆడబిడ్డలకు ఎలా పెళ్లి చేయాలనే ఆలోచనతో నిద్రలేని రాత్రులు కూడా గడిపింది గంగవ్వ. దాదాపు పదేళ్లు భర్త నుంచి కబురు కూడా లేకపోవడంతో.. అసలు భర్త ఉన్నాడో లేడో తెలియని అయోమయంతో మరింత కుంగిపోయింది. భర్త ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే ! వస్తే రానీ.. లేదంటే లేదు.. నా బిడ్డలను నేను చూసుకుంటా అనే మొండి ధైర్యమే ఆమెను ముందుకు నడిపింది. ఆ అబలే సబలగా మారి… పైసా పైసా కూడబెట్టి… పెద్ద బిడ్డ పెళ్లి చేసింది. అప్పుడొచ్చాడు భర్త.. పదేళ్ల తర్వాత వచ్చాడు కదా.. మారిపోయాడేమో.. మా కోసం ఎంతో కొంత కూడబెట్టుకొచ్చాడేమో అనుకుంది ఆ వెర్రి తల్లి. కానీ వచ్చి రాగానే.. కొట్టడం స్టార్ట్ చేశాడు. కానీ ఈ సారి ఎదురుతిరిగింది. నువ్వు ఉన్నా లేకున్నా ఒక్కటే అంది. భర్తగా నేను.. తండ్రిగా పిల్లలు నిన్నెప్పుడో మర్చిపోయారు.. నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసింది. భర్త సాయం లేకుండానే పిల్లల పెళ్లిళ్లు చేసి..సమాజంలో తనకంటూ ఓ గౌరవాన్ని పొందింది. జీవితాంతం కష్టాలతోనే సావాసం చేసిందనుకున్నాడో ఏమో..ఆ దేవుడు మై విలేజ్ షో డైరెక్టర్ శ్రీకాంత్ రూపంలో తన దగ్గరకు వచ్చాడు. ఆమె తెలంగాణ యాసకు మెచ్చి.. ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. అంతే.. ఆ వీడియో తీసి యూట్యూబ్‌లో ఇలా పెట్టాడో లేదో.. అలా స్టార్ అయిపోయింది గంగవ్వ.
సహజ నటనకు కేరాఫ్..
కనీసం అక్షరాలు కూడా సరిగ్గా రాయలేని గంగవ్వ.. తెలంగాణ యాసలో చితగ్గొట్టేసింది. ఆమె సహజ నటనకు ఫిదా అయిన తెలుగు ప్రజలు..గంగవ్వను యూట్యూబ్ స్టార్‌ను చేసేశారు. ఓ మామూలు మహిళకు ఇచ్చిన ఛాన్స్.. ఆమెను పదిమందికి స్పూర్తినిచ్చేలా నిలబెట్టింది. అందుకే దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంటుంది.. ‘ఒకటి సృష్టి… రెండు ఆడవాళ్లు’. అలాంటి వాళ్లకు సరెండర్ అయిపోవాలే తప్ప… శాడిజం చూపించకూడదు అని చెప్పాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒక్కసారి ఫాలో అయి చూడండి.. ఓ మహిళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వారవుతారు.