- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధైర్యే సాహసే.. ‘లక్ష్మీ’ అగర్వాల్
దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయి పుట్టింది… కొందరు మాకు ఏకంగా లక్ష్మీదేవే వచ్చిందని సంబరపడిపోయి గారాబంగా పెంచుకుంటే.. మరికొందరు పురిట్లోనే తుంచేస్తున్నారు. పురిట్లో చనిపోయిన బిడ్డ సరే … లక్ష్మీదేవిగా పెంచుకుంటున్న బిడ్డ సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తుందని చెప్పలేం. అడుగడుగునా మృగాలే… మాట మాటలో భయాలే. ఇంట్లో మామయ్య, బాబాయిలను కూడా నమ్మలేని పరిస్థితి. తల్లిదండ్రుల ముందు బిడ్డను కూతురిలా చూసుకున్నా చీకటిలో మాత్రం కామాంధుడిగా మారిపోతాడు. ఆ విషయం చిన్నారికి తెలుస్తుందా? గమనిస్తుందా? గమనిస్తే ఓకే. బిడ్డ సేఫ్. కానీ, ఆ కామాంధుడి కళ్లను ఆ చిన్నారి చూపులు కనిపెట్టలేదనుకో.. జీవితం శూన్యంలోకి నెట్టేయబడినట్లే. ఒకవేళ అదృష్టం కొద్దీ ఆ స్టేజ్ నుంచి బయటపడినా స్కూల్లో కీచక టీచర్, కాలేజ్‌లో బరితెగించిన లెక్చరర్, రోడ్డు పక్కన రోమియోలు… ఇందరి నుంచి తప్పించుకోవాలి. ఒకవేళ ఇక్కడా తప్పించుకుని… పెళ్లిపీటలు ఎక్కిందంటే.. మరో నరకం భర్త రూపంలో అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్ఆర్ఐ సంబంధం అంటూ బిడ్డను కన్యాదానం చేసి అప్పగిస్తే వరకట్నం వేధింపులంటూ మరో టార్చర్ స్టార్ట్ అవుతుంది మహిళకు. టార్చర్ భరించలేక చనిపోతుంది. తల్లిదండ్రులకు చెప్తే నరకం నుంచి బయటపడుతుంది. ఒక వేళ తల్లిదండ్రుల పంచన చేరితే .. పెళ్లి చేసుకుని ఏం లాభం? భర్తను వదిలేసి వచ్చేసిందట ఆ పిల్ల.. అంటూ సమాజం నుంచి సూటిపోటి మాటలు. ఒక ఆడపిల్లగా పుడితే ఇన్ని భరించాల్సి వస్తుంది. ఇంత నరకం అనుభవించిన అమ్మాయికి అప్పుడు అనిపిస్తుంది.. అమ్మానాన్న నన్ను అనవసరంగా పెంచారే? పురిట్లోనే చంపేసి ఉంటే బాగుండు కదా అని. కానీ, అమ్మానాన్న పురిట్లో చంపేస్తే ఓ న్యూస్… పెంచి పెద్ద చేసి భర్త చేతిలో చనిపోతే మరో న్యూస్. మొత్తానికి ఓ ఆడబిడ్డ జీవితం ఇన్‌సెక్యూర్. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని ఓ జీవిత నాటకం. కానీ, అలాంటి ఉపద్రవాలను కూడా సవాల్‌గా స్వీకరించిన మహిళలు చాలామంది ఉన్నారు. జీవితం శూన్యం అయిపోయిందనే ఆలోచన నుంచే నా జీవితం నా ఆలోచనకు అనుగుణంగా సాగాలి అనే సంకల్పంతో ఉదయించిన నారీమణులు ఉన్నారు. అందుకే బలమైన స్త్రీలు పుట్టారు. వారి జీవితంలో ఎదురైన అనుభవాలే వారిని రాటు దేల్చుతాయి. బలమైన స్త్రీగా మనుగడ సాగించేందుకు ప్రోత్సహిస్తాయి. ఇతర మహిళల జీవితాలపై కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ కోవకు చెందిన నారీమణే లక్ష్మీ అగర్వాల్.
‘ఆమె’ ఉద్యమాలకు ఊతం
” యత్ర నార్యస్తు పూజ్యంతే … రమంతే తత్ర దేవతా: “. ఈ శ్లోకం సారాంశం చాలామందికి తెలిసే ఉంటుంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో… అక్కడ దేవతలు నివసిస్తారని అర్థం. చాలామందికి అర్థం తెలుసు… కానీ, దాని పరమార్థాన్ని పసిగట్టరు. ఫలితం ఆడపిల్లలపై లైంగిక వేధింపులు, యాసిడ్ అటాక్‌లు. లక్ష్మీఅగర్వాల్ విషయంలోనూ ఇదే జరిగింది. మ్యూజిక్ మీదున్నా ఇంట్రెస్ట్ చంపుకోలేక.. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని .. స్కూల్‌కి వెళ్తూనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సంగీతం నేర్చుకుంది. అప్పుడు లక్ష్మీకి 15 ఏళ్లు. ఆ సమయంలోనే 35 ఏళ్లున్న బాబాయి తనను లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే ఎలాంటి ప్రాబ్లమ్ వస్తుందోనని ఆలోచించిన ఆ బిడ్డ… విషయం చెప్పకుండా దాచేసింది. ఇదే ప్లస్ పాయింట్ అయింది ఆ మూర్ఖుడికి .. నాతో తిరగాలి… నన్ను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయినా కూడా లక్ష్మీ లొంగకపోవడంతో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. నాకు దక్కని అందం .. మరెవరికి దక్కకూడదనే కసితో మరో ఇద్దరితో కలిసి లక్ష్మీపై యాసిడ్ పోశాడు. అందరూ చూస్తుండగానే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు ఆ కామాంధుడు. యాసిడ్ అటాక్‌తో విలవిలలాడిపోతున్న లక్ష్మీ అగర్వాల్‌ను చూస్తున్నా .. ఆమె బాధను కళ్లారా వీక్షిస్తున్నా… యాసిడ్ మంటకు చర్మం ఊడిపోయి దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న లక్ష్మీని లేపేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. మాకేందుకు అనవసరమైన హెడేక్ అనుకున్న కొందరు అక్కడి నుంచి పరారయ్యారు కూడా. కానీ, ఓ వివేకవంతుడు ముందుకొచ్చాడు. లక్ష్మీకి వాటర్ బాటిలిచ్చి… యాసిడ్ మంటలున్న చోట తుడుచుకోవాలని సూచించాడు. కానీ, అప్పటికే జరగరానిది జరిగిపోయింది. ఒళ్లు మొత్తం కాలిపోయింది… మొహం రూపం లేకుండా అయిపోయింది. ఎంతో అందంగా ఉండే తన మొహాన్ని రోజూ చూసుకుని మురిసిపోయే లక్ష్మీ అగర్వాల్… ఆ రోజు తన మొహాన్ని చూసి భయపడిపోయింది. ట్రీట్‌మెంట్ జరిగినా కూడా తన ఫేస్‌ను అద్దంలో చూసుకునేందుకు కూడా జంకేదట. ఆ భయం నుంచే ఆవేశం పుట్టుకొచ్చింది. నాలాంటి ఎందరో ఆడపిల్లలు ఇలా యాసిడ్ దాడికి బలవుతున్నారే… వాటన్నింటిని ఆపాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగింది. ఎన్నో పోరాటాలు చేసింది… మరెన్నో ఉద్యమాలు నడిపింది.
స్టాప్ యాసిడ్ సెల్లింగ్..
ధైర్యే సాహసే లక్ష్మీ.. అంటారే. అలా ఆమె దైర్యాన్ని కూడదీసుకొని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. కెమికల్ అటాక్స్ జరగకుండా ఉండేలా చట్టం తీసుకురావాలని కోరింది. యాసిడ్ బ్యాన్ చేయాలంటూ వాదించింది. ఫలితంగా కొత్త చట్టం క్రియేట్ అయింది. ఇండియాలో వ్యక్తిగతంగా యాసిడ్ అమ్మకూడదంటూ ఓ చట్టాన్ని తీసుకొస్తూ ప్రభుత్వం ఆమోదించింది. కానీ, అది గ్రౌండ్ లెవల్‌లో ఆచరణలోకి రాలేదనేది సత్యం. యాసిడ్ బాధితులను కలిసి వారి బాధలు విన్న లక్ష్మీ… స్టాప్ యాసిడ్ అటాక్ పేరుతో ఉద్యమాన్ని నడిపింది. ఫలితంగా సమాజంలో మార్పులు వచ్చాయి. అప్పటి నుంచి దేశంలో యాసిడ్ అటాక్స్ సంఖ్య తగ్గిపోయింది.
కాల్చబడలేనిది లక్ష్యం..
ఇప్పటికీ లక్ష్మీ అగర్వాల్ చెప్పే మాట ఒక్కటే… వాడు ‘యాసిడ్ పోసింది నా మీదే కానీ.. నా కలల మీద కాదు అని’. యాసిడ్ కూడా కాల్చలేనిది నా లక్ష్యం అని గొప్పగా చెబుతూ… జీవితంలో అలసిపోయిన ఎందరో మహిళలకు ఓ స్ఫూర్తిగా నిలిచింది. అందుకే ఆమె ఏకంగా అంతర్జాతీయ సాహస మహిళా అవార్డు అందుకున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు లక్ష్మీ అగర్వాల్. అంతేకాదు అమ్మాయిలూ మీలో లక్ష్యం, పట్టుదల ఉంటే… అందంతో పనిలేదు అనే సందేశాన్నిస్తూ లండన్ ఫ్యాషన్ వీక్‌లోనూ పాల్గొని తానేంటో రుజువు చేసింది. ఫైనల్‌గా బంతిని గోడకు కొడితే ఎంత వేగంగా దూసుకొస్తుందో… తనను కృంగదీసేందుకు ఓ ఉన్మాది చేసిన దాడి.. లక్ష్మీ అగర్వాల్‌ను ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగేలా చేసింది. ఎందరికో ప్రేరణగా నిలిచేలా తీర్చిదిద్దింది.