బిడ్డకు జన్మనిచ్చానంటున్న మహిళ..అబద్ధమంటున్న వైద్యులు !

by srinivas |
బిడ్డకు జన్మనిచ్చానంటున్న మహిళ..అబద్ధమంటున్న వైద్యులు !
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మాయం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు బిడ్డ పుట్టాక కనపడకుండా మాయం చేశారని మహిళ చెబుతుండగా.. అసలు ఆమె కడుపులో బిడ్డే లేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగనెల్లూరుకు చెందిన శశికళ అనే గర్భిణి రెండ్రోజుల క్రితం తిరుపతి మెటర్నటీ ఆస్పత్రిలో చేరింది. తనకు వైద్యులు కాన్పు చేసి వైద్యులు బిడ్డను తీశారని, తర్వాత మాకు కనపడకుండా చేశారని మహిళ ఆరోపిస్తోంది. ఈనేపథ్యంలోనే ఆ మహిళ బంధువులు, ఆస్పత్రి వర్గాల మధ్య గొడవ జరిగి విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది.

అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం శశికళ కడుపులో బిడ్డ లేదని, కావాలనే వైద్యులపై నెపం వేస్తున్నారని పోలీసులకు తెలిపారు. ఇదేక్రమంలో శశికళ గర్భవతిగా ఉన్న సమయంలో తీసిన శ్రీమంతం ఫోటోలను బంధువులు పోలీసులకు చూపించారు. శ్రీమంతాన్ని ఊరిలో పెద్దగా జరిపించామని చెబుతున్నారు. మహిళ బంధువులు, ఆస్పత్రి వర్గాలు భిన్నవాదనలు చెబుతుండటంతో సినిమా ట్విస్ట్‌ను తలపిస్తోంది. అసలు శశికళ గర్భం దాల్చిందా లేదా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న మహిళ సంఘాలతో పాటు, శశికళ బంధువులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇటు శశికళ బంధువులు, ఆస్పత్రి వర్గాలు చెరో విధంగా చెబుతుండగానే ఇప్పుడు ఇంకో విషయం గట్టిగా వినపడుతోంది. అసలు శశికళ గర్భం దాల్చలేదని గూడురు మైథిలి ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. 2020 ఆగస్టులో శశికళ దంపతులు ఆస్పత్రికి వచ్చారని, అప్పుడే పరీక్షలు నిర్వహించి ఆమె గర్భం దాల్చలేదని చెప్పామని స్పష్టం చేశారు. ఈనెల 4 ఐవీఎఫ్‌కు సూచించామని తెలిపారు. ప్రస్తుతం ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో అసలు శశికళ గర్భం దాల్చిందా లేకుంటే అబద్దాలు చెబుతున్నదా ! మరి ఆస్పత్రి వర్గాలే బిడ్డను మాయం చేసి మాటను మార్చుతున్నారా, లేక వీరి మాటలే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా అన్నది ఇవాళ రాత్రి వరకు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed