పొలంలో క్షుద్రపూజల కలకలం.. గాజులు, నిమ్మకాయలతో అలా చేసి..

by Shyam |   ( Updated:2023-04-13 17:57:12.0  )
పొలంలో క్షుద్రపూజల కలకలం.. గాజులు, నిమ్మకాయలతో అలా చేసి..
X

దిశ, పరకాల: ప్రపంచం సాంకేతికంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే కొంతమంది మాత్రం మూఢ విశ్వాసాలతో వారి జీవితాలను ఛిద్రం చేసుకోవడంతో పాటు పక్క వారి జీవితాలను సైతం గందరగోళంలో పడేస్తున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇందుకు సంబంధించిన వివరాలు.. పెద్దకోడెపాక గ్రామానికి చెందిన బొద్దుల మొగిలి అనే రైతు తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి పంట వేశాడు. పంట సైతం ఈసారి ఆశాజనకంగా ఉంది. రైతు కుటుంబం పంటను చూసి ఆనందిస్తుంటే ఏ మహానుభావుడు కుట్ర పన్నాడో ఏమో నిండు పత్తిలో క్షుద్ర పూజలు జరిపారంటూ రైతు కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అన్నం, రకరకాల గాజులు, నిమ్మకాయ, పట్టుచీర ముక్క, కొత్త రవిక ముక్కలు, జామకాయ, కొబ్బరి చిప్పలు తదితరాలతో పత్తిలో వింత పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయంటున్నారు. గ్రామస్తులు సైతం భయం భయంగా చర్చించుకుంటున్నారు. తన కుటుంబానికి హాని తలపెట్ట డానికే ఈ కుట్ర చేశారంటూ రైతు లబోదిబోమంటునాడు. పత్తి లోకి వెళ్లాలంటే ధైర్యం సరిపోవడం లేదంటూ , పత్తి ఏరించాలంటే కూలీలు సైతం వచ్చే అవకాశం లేదని దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తపరిచారు. రైతు కుటుంబం‌తో పాటు గ్రామస్థులు సైతం ఈ ఘటనతో భయంతో బిక్కుబిక్కు మంటూ గడపాల్సి వస్తుందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.

ఈ ఘటనకు సంబంధించి గ్రామంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా గ్రామానికి చెందిన ఓ మహిళ ఎల్లమ్మ దేవత పూనిందంటు సోది చెపుతూ పెద్దకోడెపాక గ్రామం‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో మూఢనమ్మకాలు పెంచి పోషిస్తూ కుటుంబాల, బంధుమిత్రుల మధ్య మంత్రాలు తంత్రాలు,నరదిష్టి లాంటివి సృష్టిస్తుందనే ఆరోపణలు సైతం గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. బుధవారం, శుక్రవారం వచ్చిందంటే ఆ మహిళ ఇంటి ముందు బార్ల కొద్ది జనం సోది కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం. ఓవైపు మనిషి సాంకేతికంగా అభివృద్ధి చెందుతుంటే సోది పేరుతో ప్రజల్ని మూఢవిశ్వాసాలలో ముంచెత్తడం ఎంతవరకు సబబు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయకపోతే ప్రజల్లో మూఢ విశ్వాసాలు పెరిగి అనైతిక కార్యకలాపాలకు దారితీసే అవకాశం ఉన్నట్లు పలు నాస్తిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed