ఉత్తమ త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన ఐటీ దిగ్గజం విప్రో

by Harish |
ఉత్తమ త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన ఐటీ దిగ్గజం విప్రో
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 35.6 శాతం వృద్ధితో రూ. 3,230 కోట్లుగా నమోదు చేసింది. కంపెనీ ఆదాయం 22.4 శాతం పెరిగి రూ. 18,250 కోట్లకు చేరుకుందని కంపెనీ వెల్లడించింది. ఒక ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో విప్రో నమోదు చేసిన అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్ మహమ్మారి పరిస్థితుల కారణంగా తీవ్ర ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ తాము అన్ని వ్యూహాత్మక మార్కెట్ యూనిట్లు, సెక్టార్లలో ఉత్తమైన త్రైమాసిక లాభాలను సాధించామని’ విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్ట్ అన్నారు.

విప్రో ఐటీ సేవల విభాగం ఆదాయం జూన్ త్రైమాసికంలో 2,414.5 మిలియన్ డాలర్లుగా నమోదైందని, ఇది గతంతో పోలిస్తే 25.7 శాతం అధికమని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఐటీ సేవల నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 5-7 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని కంపెనీ అభిప్రాయపడింది. అంతేకాకుండా, ఈ ఏడాది జూన్ 30 నాటికి ఐటీ విభాగంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2 లక్షల మార్కును అధిగమించి మొత్తం 2,09,890 ఉద్యోగులకు చేరుకున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, గురువారం విప్రో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ధర దాదాపు 3 శాతం పెరిగి రూ. 578.35కి చేరుకుంది.

Advertisement

Next Story