- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అప్పు'రూపంగా హరితహారం
దిశ, మేడ్చల్: అదో అపురూపమంటూ గొప్ప ప్రచారం జరిగింది. ఆ విధంగానే ఇది ప్రథమ స్థాయిలో నిలిచింది. కానీ, ఇప్పుడు లెక్క తక్కువైంది. కారణం తెలిసినా కూడా ఏదేదో చెప్పారు. సరేనని అప్పులు చేసి కొనసాగించారు. అయినా కూడా అదే తీరు.. దీంతో వాళ్లు తలలు పట్టుకుంటున్నారు. అదేంటో మీరే చూడండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం హరితహారం. అధికారంలోకి వచ్చింది మొదలు.. రెండోసారి గెలిచే వరకు ఎటు చూసినా, ఎవరి నోట విన్నా హరితహారం జపమే . గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ఇదో అపురూప పథకం అనే స్థాయిలో సీఎం కేసీఆర్, తన అనుచర గణం ప్రచారాలు దంచికొట్టారు. మొక్కలు నాటకపోతే.. ఇగ రెండేండ్లలో ప్రపంచం మునిగిపాయె అన్న రేంజ్‌లో ఊకదంపుడు ప్రచారాలు చేశారు. ఆ ప్రచారాలన్నీ కేవలం పత్రికాప్రకటనలు, ఫొటోలకు ఫోజులిచ్చేందుకే పనికొచ్చింది. ఐదేండ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా హరితహారం పరిస్థితి మారింది. ఖర్చు చేసిన నిధులకు బ్రతికిన మొక్కలకు ఎంతమాత్రం పొంతన కుదరట్లేదు. అయినా మరోసారి హరితహారానికి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో 86 శాతం మొక్కలు బతికినట్టు చెబుతున్నారు. మరీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. ‘అడవులు రావాలె.. కోతులు వాపస్ పోవాలె. ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేశాం.. ఒక్క మొక్క చచ్చినా చర్యలు తప్పవు’ ఇది ఏటా ప్రభుత్వపెద్దలు చెప్పే మాటలు. కానీ, ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. నాటిన మొక్కల్లో సగం కూడా బతకట్లేదు. ఇందుకు నిధులలేమి ప్రధాన సమస్యగా మారింది.
గతేడాది నాటడంలో టాప్..
జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 81 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుగుణంగానే లక్ష్యాన్ని సాధించింది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం సగానికిపైగా మొక్కలు బతకలేదనే చెప్పాలి. నాటడంలో చూపిన శ్రద్ధ.. సంరక్షించడంలో చూపించడం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. ఉన్నతాధికారులు నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు మున్సిపాలిటీ, మండల, కార్పొరేషన్ అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. లక్ష్యం విధించిన మేర నిధులను కల్పించకపోవడంతో మొక్కలను ఎలా సంరక్షించాలో తెలియట్లేదు. మొక్కలను నాటడం అయితే ఎలాగోలా నాటించారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధుల చుట్టూ రేయింబవళ్లు తిరిగి లక్ష్యం పూర్తిచేసి మేడ్చల్ జిల్లాను టాప్‌లో నిల్చొబెట్టారు. కానీ, వాటిని సంరక్షించేందుకు అధికారులు అగచాట్లు పడాల్సి వస్తోంది. మొక్కను సంరక్షించడం అంటే ఒకట్రెండు రోజుల్లో పూర్తయ్యే పనికాదని తెలిసిందే. మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయడం దగ్గరి నుంచి నిత్యం నీటిని పోసేందుకు సరిపడా నిధులు లేక అధికారులు సైతం చేతులేత్తేశారు. ఫలితంగా నాటిన మొక్కల్లో సగానికి పైగా బతకలేదు.
లక్ష్యం మేర పైసలియ్యట్లేదు..
హరితహారంలో నిర్దేశించిన మొక్కల లక్ష్యం మేరకు నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. వాస్తవానికి కూలీ ధరలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు గుంతలు తీసి మొక్కలు నాటేందుకు కూడా సరిపోవడం లేదు. వాటికి రోజుల తరబడి ట్యాంకర్ల ద్వారా నీటిని పోయడం స్థానిక ప్రజాప్రతినిధులకు పెద్ద తలనొప్పిగా మారింది. కొంతమంది ప్రజాప్రతినిధులు అప్పులు చేసి మరీ ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని పోయించిన సందర్భాలు లేకపోలేదు. అధికారులు ప్రజాప్రతినిధులకు ఉన్నతాధికారుల పేరు చెప్పో.. లేక మీ గ్రామపంచాయతీకి ఉత్తమ అవార్డు వస్తుందనో.. నయానో భయానో.. మొక్కల సంరక్షణ బాధ్యతలను స్థానిక ప్రజాప్రతినిధులపై రుద్దుతున్నారు. దాంతో వారు కూడా ఆరునెలల వరకు సొంత జేబుల్లోంచి ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎంతకీ నిధులు రాకపోవడంతో వారు సైతం చేతులెత్తేస్తున్నారు. అప్పులు చేసి పెట్టడం మా వల్ల కాదంటూ ఉన్నతాధికారులకే నేరుగా విన్నవించుకుంటున్నారు. సదరు అధికారులు సైతం ఈ ఏడాది టార్గెట్ పూర్తయ్యింది. మల్లొచ్చేయేడు కదా.. అప్పుడు చూద్దాం మొక్కల సంగతి అంటూ నిట్టూరుస్తున్నారు. రాష్ట్ర తెలంగాణ అటవీశాఖ వద్ద సైతం కేంద్రం నుంచి వచ్చే నిధులు తప్ప పైసా ఉండట్లేదు. కంపా స్కీమ్ కింద ఉన్న నిధులనే అటవీశాఖ అన్ని పనులకు ఉపయోగించుకుంటుండడం గమనార్హం.
ఈ ఏటా 72.7 లక్షల మొక్కలు టార్గెట్..
మేడ్చల్ జిల్లాలో 2020-21 సంవత్సరానికి సంబంధించి 72.7 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలు కలిసి ఉంటాయి. దీంతో గ్రామపంచాయతీల్లో 31.7 లక్షలు, మున్సిపాలిటీల్లో 21 లక్షలు, కార్పొరేషన్లలో 20 లక్షల మొక్కలు నాటే విధంగా లక్ష్యం పెట్టుకున్నారు. గ్రామపంచాయతీల్లో సర్పంచ్, కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో చైర్మన్, సంబంధిత మున్సిపల్ అధికారులు మొక్కలను నాటడడంతోపాటు సంరక్షించే బాధ్యతలు తీసుకోనున్నారు. మరీ ఈ సంవత్సరం నాటడానికే పరిమితమవుతారా? లేక ఎప్పటిలాగే ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శిస్తారో వేచి చూడాల్సిందే.
tags : Medchal, Haritha haram, budget, plants, officers