- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టార్ క్యాంపెయినర్‌గా కేటీఆర్.. మరి ప్రచారం సంగతేంటి?
దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సర్వశక్తులూ ఒడ్డుతున్నది. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న మంత్రి హరీష్ రావు ఇప్పటికే అన్ని బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. నోటిఫికేషన్ కూడా రావడంతో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడానికి పార్టీ స్టార్ క్యాంపెయినర్‌లను ఎంపిక చేసింది. అందులో కేటీఆర్ కూడా ఉన్నారు. కానీ, కేటీఆర్ ప్రచారానికి వెళ్తారా? లేదా? అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. రెండేళ్ళ క్రితం హుజుర్ నగర్ ఉప ఎన్నికలో మాత్రమే ప్రచారం చేసి ఆ తర్వాత దుబ్బాక, నాగార్జునసాగర్ ప్రచారాల్లో కేటీఆర్ దూరంగా ఉన్నారు. మరి ఇప్పుడు హుజూరాబాద్ విషయంలో ఆయన వైఖరేంటనేది ఆసక్తికరంగా మారింది.
“ఇది చాలా చిన్న ఎన్నిక. ఆల్రెడీ హరీష్ రావు చూసుకుంటున్నారు. మా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు” అంటూ ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యానించారు. చాలా చిన్న ఎన్నిక అంటూ స్వయంగా వ్యాఖ్యానించిన తర్వాత అక్కడకు వెళ్ళి ప్రచారం చేయడానికి సిద్ధపడతారా అనే చర్చలు జరుగుతున్నాయి. దుబ్బాక, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా కూడా కేటీఆర్‌ను టీఆర్ఎస్ పార్టీ ఒక స్టార్ క్యాంపెయినర్‌గానే ఎన్నికల సంఘానికి తెలియజేసింది. కానీ, ఆ రెండు చోట్లా కేటీఆర్ ప్రచారానికి వెళ్లలేదు. ఇప్పుడు హుజురాబాద్ విషయంలోనూ అదే పునరావృతం కావచ్చనే అభిప్రాయం పార్టీలో నెలకొన్నది.
పైగా కేటీఆర్ తనంతట తానే హుజూరాబాద్ ఉప ఎన్నికను చాలా చిన్న ఎన్నిక అని వ్యాఖ్యానించినందున ప్రచారానికి వెళ్ళిన తర్వాత సరికొత్త చర్చకు ఆస్కారమిస్తుందనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతున్నది. హరీష్ రావు గెలుపు బాధ్యతలు తీసుకున్నందున కేటీఆర్ దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాన్ని ఒక సీనియర్ నేత వ్యక్తం చేశారు. ఎలాగూ కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ఇప్పటికే దళితబంధు కార్యక్రమాన్ని హుజూరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. మళ్లీ ప్రచారం కోసం అక్కడికి వెళ్లనున్నారు.
రాష్ట్రంలో 2018 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా ఆయన చొరవ తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. ఆశించినదానికి భిన్నమైన ఫలితం వచ్చినప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను గెలిపించుకోగలిగారు. కానీ, ఉప ఎన్నికల విషయంలో మాత్రం అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. పైగా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికను హరీశ్‌రావే దగ్గరుండి చూసుకున్నారు. నాగార్జునసాగర్ ఎన్నిక విషయాన్ని కేసీఆర్ చూసుకున్నారు.
ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యత సైతం కేసీఆర్, హరీష్ రావు చూసుకుంటున్నందున కేటీఆర్ వీలైనంత వరకు దూరంగా ఉండే అవకాశమే ఉన్నదని ఆయనకు సన్నిహితంగా ఉన్న నాయకుడొకరు వ్యాఖ్యానించారు. స్టార్ క్యాంపెయినర్‌గా పేరు పెట్టినంత మాత్రాన కచ్చితంగా ప్రచారానికి వెళ్తారని భావించనవసరం లేదన్నారు. ఎలాగూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనకు అనుకూలంగా ఉన్న యువ ఎమ్మెల్యేలు, నేతలు ఇప్పటికే అక్కడ మకాం వేసి మూడు నెలలుగా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారని గుర్తుచేశారు. ఇక సోషల్ మీడియా తరపున కూడా పలువురు క్షేత్రస్థాయిలోనే ఉండి పనిచేస్తున్నారని, వారిని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారని పేర్కొన్నారు.