- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసారైనా సారు కనికరించేనా.?
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరు. సుదీర్ఘ రాజకీయానుభం ఆయన సొంతం. సొంత సామాజిక వర్గంలోనే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లోనూ ఆయనకు బలమైన పట్టు ఉంది. పలు దఫాలు ప్రజాప్రతినిధిగానూ పనిచేశారు. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో క్రీయాశీలకంగా వ్యవహరించారు. కానీ ఆయనకు ఎప్పట్నుంచో మంత్రి కావాలనేది చిరకాల కోరిక. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీలో ఆయన కొనసాగారు. కానీ ఏనాడూ ఆయన కోరిక నేరవేరలేదు. అసలే ఓవైపు వయస్సు మీద పడుతోంది. ఇప్పుడైనా మంత్రి పదవి దక్కుతుందా..? లేదా? అన్నది మీమాంసగా మారింది. ఇంతకీ ఆ వ్యక్తి మరెవరో కాదు.. నల్లగొండ జిల్లా సీనియర్ నేత, శాసనమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి. టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గుత్తా ఆయా పార్టీల్లో ఉన్నారు. కానీ ఆయన్ను ఏనాడూ మంత్రి పదవి వరించలేదు. చివరకు టీఆర్ఎస్ పార్టీలోనైనా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ శాసనమండలి చైర్మన్ గిరీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ మంత్రి మండలిలో మార్పులు- చేర్పులు ఉండనున్నాయనే ఊహగానాల నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కలకు మళ్లీ జీవం పోసినట్టయ్యింది. ఈసారైనా కేసీఆర్ సారూ స్పందించి.. మంత్రి కట్టబెడతారా..? లేదా అన్నది వేచిచూడాల్సిందే.
గుత్తా రాజకీయ ప్రస్థానమిదీ..
నల్లగొండ జిల్లాలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం జనతా పార్టీ నుంచి ప్రారంభమైంది. అనంతరం టీడీపీలో చేరి కీలక నేతగా పనిచేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరిన సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ చైర్మన్‌గా నామినేటెడ్ పోస్టును అప్పగించారు. కాగా 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం శాసనమండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మంత్రి పదవి కోసం వచ్చే ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు.
మంత్రి పదవి ఆశతోనే టీఆర్ఎస్‌లోకి..
గుత్తా సుఖేందర్ రెడ్డికి చట్టసభల్లో అడుగుపెట్టి ఒక్కసారైనా మంత్రి పదవిని స్వీకరించాలనేది చిరకాల కల. వాస్తవానికి గుత్తా.. మంత్రి పదవి వస్తుందనే ఆశతోనే కాంగ్రెస్‌కి హ్యాండిచ్చి కారు ఎక్కారనే ప్రచారం మొదటి నుంచి లేకపోలేదు. టీఆర్ఎస్‌లోకి జంప్ కొట్టి ఏండ్లు గడుస్తున్నా.. ఆయనకు మంత్రి పదవి మాత్రం నేటికీ దక్కలేదు. క్యాబినేట్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయనే వార్తలు వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి దక్కుతుందని ఆశపడడం.. అది దక్కక నిరాశ పడడం పరిపాటిగా మారింది. అయితే శాసనమండలి చైర్మన్ పదవిని తీసుకున్న దగ్గరి నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లా క్రీయాశీలక రాజకీయాలకు దూరం అవుతున్నారనే భావనను అనుచరగణంతో ఆయన వ్యక్తం చేశారనే సమాచారం.
సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో నిత్య పర్యటన..
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారడంతో మళ్లీ కేబినెట్‌లో మార్పులు-చేర్పులు జరుగుతాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికితోడు నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ఉండడంతో మళ్లీ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలకంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గంతో పాటు దేవరకొండ నియోజకవర్గంలోనూ నిత్యం పర్యటిస్తూ వస్తున్నారు. పార్టీ నేతల మరణాల దగ్గర నుంచి ప్రతి చిన్న కార్యక్రమానికీ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ రెండు నియోజకవర్గాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైఫల్యాలు, ఇతరత్రా కారణాల నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే అందివచ్చిన అవకాశాన్ని గుత్తా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారట. ఈసారైనా సీఎం కేసీఆర్ సారూ స్పందించి.. గుత్తాకు మంత్రి పదవి కట్టబెడతారా..? సుఖేందర్ రెడ్డి కల నెరవేరుతుందా..? అన్నది జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది.