- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్ బైపోల్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నిక పోరు ప్రత్యేకమైనది. ఇది బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంగా కనిపిస్తున్నది. అదే సమయంలో కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య పోరుగా కూడా మారింది. కానీ చివరికి ఇది టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ గానే భావించాలి. పార్టీ ఆవిర్భవించిన ఇరవై ఏళ్ళలో తొలిసారి ఈ తరహా సవాలును పార్టీ ఎదుర్కొంటున్నది. ఈటల రాజేందర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆరు సార్లు గెలిచింది టీఆర్ఎస్ పార్టీ గుర్తుపైనే. తొలిసారి వేరే పార్టీ గుర్తుపైన పోటీ చేస్తున్నారు. దాదాపు 18 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆయనకంటూ ప్రత్యేకమైన కార్యకర్తలను తయారుచేసుకున్నారు. వారంతా టీఆర్ఎస్ కార్యకర్తలే. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బైటకు రావడంతో ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ వెనక ఉన్న శ్రేణులు, రాజేందర్ వెనక ఉన్న శ్రేణులు ఒకే పార్టీకి చెందినవారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలో వీరు రెండు వర్గాలుగా చీలిపోయారు. స్వంత పార్టీ శ్రేణుల్నే ఈటల రాజేందర్ నుంచి దూరం చేయడానికి ప్రలోభాలను ఎర వేయాల్సి వస్తున్నది. మరోసారి గులాబీ కండువాలను కప్పాల్సి వస్తున్నది.
నిజానికి ఈటల రాజేందర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే ఉప ఎన్నిక వచ్చినట్లయితే బాగుండేదని ఆయన భావించారు. వీలైనంత తొందరగా ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలయ్యేలా చొరవ తీసుకోవాల్సిందిగా బీజేపీ అధిష్టానాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటే హుజూరాబాద్‌కు కూడా నిర్వహించినట్లయితే తన నుంచి స్థానికంగా ఉన్న నేతలను కాపాడుకోగలిగేవారమని ఆయన భావిస్తున్నారు. భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా చాటుకునేవారినంటూ సన్నిహితులతో వాపోయారు. ఇప్పటికైనా గెలుపుపై ధీమా సడలకపోయినప్పటికీ చివరి నిమిషంలో ఏం జరుగుతుందోననే ఆందోళన మాత్రం వెంటాడుతున్నది.
కేసీఆర్, ఈటల మధ్య పోటీ
హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష పోటీగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ ముఖాన్ని మాత్రమే చూసి ఓటు వేస్తారని టీఆర్ఎస్ నేతలే చెప్పుకున్నారు. ఆయన ఇమేజ్, పార్టీ గుర్తు మాత్రమే అభ్యర్థిని గెలిపిస్తుందని పేర్కొన్నారు. కానీ ఈటల రాజేందర్ విషయంలో మాత్రం ఆయనకు నియోజకవర్గ ప్రజల్లో ఉన్న గుర్తింపు ద్వారానే ఎదురీదుతున్నారు. ఇక్కడ బీజేపీకి పెద్దగా గుర్తింపు లేదు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ ద్వారా పార్టీకే గుర్తింపు లభిస్తున్నది. ఇక్కడి గెలుపు, ఓటమి వ్యక్తులుగా కేసీఆర్, ఈటల రాజేందర్ కు సంబంధించిన వ్యవహారమే తప్ప బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినది కాదు.
ఒత్తిడి చేయని బీజేపీ
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు ఉన్న గుర్తింపు కారణంగా బీజేపీ అగ్ర నేతలు కూడా ఆయనపై ఎక్కడా ఒత్తిడి తీసుకురాలేదు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై లాంటి నినాదాలు ఇస్తున్నా ఈటల రాజేందర్ మాత్రం వాటి పట్ల పెద్దగా సుముఖంగా లేరు. ఆయన గెలుపుతో పార్టీకి కూడా మైలేజీ వస్తుందన్న ఉద్దేశంతో అగ్ర నేతలూ ఆయనపై నినాదాల విషయంలో పెద్దగా ఒత్తిడి తేలేదు. పైగా ఈటల రాజేందర్ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన వామపక్ష భావజాలం విషయంలో ఆ సెక్షన్ ఓటర్లు ఇప్పటికీ ఆయనకు నైతికంగా మద్దతుగానే ఉంటున్నారు. సైద్ధాంతికంగా ఆయన పోటీ చేస్తున్న బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ వ్యక్తిగా ఆయనకే మద్దతు పలకడం గమనార్హం. బీజేపీ నేతలు ఇస్తున్న నినాదాలు ప్రయోజనం కలిగించడానికి బదులుగా చేటు చేస్తాయన్న ఉద్దేశంతో వాటికి దూరంగానే ఉండిపోయారు.
కలిసొచ్చిన ఆత్మగౌరవం సెంటిమెంట్
ఈటల రాజేందర్ పట్ల గ్రామీణ ప్రజానీకంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లో కాస్త భిన్నమైన స్పందన ఉన్నది. ఉద్దేశపూర్వకంగానే తనను పార్టీ నుంచి గెంటివేశారని తొలి రోజుల్లో చేసిన వ్యాఖ్యలు ఆయన పట్ల సానుభూతి కలిగించింది. చివరకు ఇది ‘కేసీఆర్ అహంకారానికి, నా ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న సమరం’ అంటూ స్వయంగా ఈటల చేసిన కామెంట్లు జనంలోకి బాగా దూసుకెళ్ళాయి. ఆయనకు ఈ సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ఇప్పుడు హుజూరాబాద్‌లో వచ్చే ఫలితాన్ని ఈ దిశగానే ఆయన ప్రచారం చేసుకోడానికి దోహదపడనున్నది. ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా బీసీ ఓటు బ్యాంకును పటిష్టంగా ఉంచుకోడానికి ఉపయోగపడింది. టీఆర్ఎస్ అభ్యర్థి బీసీ వ్యక్తి అయినప్పటికీ ఆ ఓటు బ్యాంకు చీలినా పెద్దగా డ్యామేజీ కాకుండా చూసుకోగలిగారు.