జనగర్జన: కాంగ్రెస్​లో టెన్షన్​.. టెన్షన్..

by Anukaran |   ( Updated:2021-03-27 03:01:34.0  )
జనగర్జన: కాంగ్రెస్​లో టెన్షన్​.. టెన్షన్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. అక్కడ ప్రచార జోరును మరింత పెంచింది. అందులో భాగంగా ఇవాళ సాయంత్రం హాలియాలో జనగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించనుంది. అయితే ఈ సభకు కాంగ్రెస్​ నుంచి ఎవరెవరు హాజరవుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్​ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్​రెడ్డి వెళ్తారా? లేదా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే రేవంత్​రెడ్డి టార్గెట్‌గా జానారెడ్డి విమర్శలకు దిగారు. ఇలాంటి తరుణంలో అవి పక్కనపెట్టి రేవంత్ వెళ్తారా? అనేది చూడాలి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి​ ఇప్పటికే నల్గొండలోనే ఉన్నారు. పీసీసీ చీఫ్ హోదాలో ఆయన వెళ్లడం ఖాయమే. ఇక ఎంపీ కోమటిరెడ్డి కూడా వెళ్తారని కాంగ్రెస్​ శ్రేణులు చెబుతున్నారు.

వద్దన్నా… వెళ్తారా..?

సాగర్​ ఉపఎన్నికకు ఇంఛార్జులుగా ఎవరూ వద్దని.. తాను, తన కొడుకులే అంతా చూసుకుంటామని జానారెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్​ ఎక్కడైతే సాగర్​ పోరుకు శంఖారావం పలికారో… అదే వేదికగా జానారెడ్డి కూడా సభ పెట్టారు. సభకు రావాలని వ్యక్తిగతంగా ఎవరినీ జానారెడ్డి ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో హాలియా సభకు ఎవరెవరు వెళ్తారనేది ఇప్పుడు కొంత ఉత్కంఠగానే మారింది. అసలే కాంగ్రెస్‌లో వివాదాలెక్కువ. పిలిస్తేనే వెళ్లని నేతలు ఇప్పుడు వెళ్తారా? అనేదే అసలు చర్చ.

మరోవైపు కాంగ్రెస్​ రాష్ట్రంలో ఎంతైనా కొంత బతకాలంటే సాగర్‌లో గెలిచి తీరాల్సిందే. దీని కోసమైనా హాలియా జనగర్జనకు పార్టీ నేతలు విభేదాలన్నీ పక్కన పెట్టి పాల్గొనే ఛాన్స్​ కూడా ఉందంటూ కొంతమంది నేతలు చెబుతున్నారు. రేవంత్‌తో పాటు భట్టి విక్రమార్క్, రాజగోపాల్​రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్​బాబు, జగ్గారెడ్డి, సీతక్క, వీరయ్య వంటి నేతలు జనగర్జనలో పాల్గొంటారని కొంతమంది నేతలు చెప్పుతున్నా… చాలా మందికి మాత్రం నమ్మకం కుదరడం లేదు. ఇప్పటికే కొంతమంది పార్టీ నేతలు హాలియా సభలో పాల్గొనేందుకు బయలుదేరారు. కానీ ముఖ్య నేతలు మాత్రం ఇంకా ఎక్కడా కనిపించడం లేదు. అటు వీహెచ్​ కూడా వెళ్లే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. అంతా కలిసికట్టుగా సాగర్‌లో పని చేస్తే గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ కలహాల కాంగ్రెస్‌లో ఎవరు కలిసి వస్తారో?… ఎవరు చేయ్యిస్తారో? చెప్పడం కష్టమే. ఈ పరిస్థితుల్లో హాలియా జనగర్జన సభ సొంత పార్టీలోనూ ఆసక్తిగా మారింది.

వెళ్తా.. వెళ్లా…!

నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ బలం ఎక్కువ. అక్కడ నుంచి చాలామంది సీనియర్​ నేతలున్నాయి. కానీ ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, రాజగోపాల్​రెడ్డి, జానారెడ్డి అంటూ ఎవరికి వారుగానే వ్యవహరిస్తారు. ఉప ఎన్నిక నేపథ్యంలో అంతా కలిసే ఉంటామంటూ ఇటీవల ఉత్తమ్​ చెప్పుకొచ్చారు. జానా కోసం కలిసి పని చేస్తామంటూ పార్టీ నేతల్లో నమ్మకం కుదిరించే ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో కొత్తగా రేవంత్​వర్గం కూడా తయారైంది. సోషల్​ మీడియా వేదికగా నల్గొండ నేతలపై విమర్శలు కూడా చేశారు. దీన్నే జానారెడ్డి వ్యతిరేకించారు. ఇది కొంతమేరకు రేవంత్​ వర్గీయులకు కోపం తెప్పించింది. కానీ ఉప ఎన్నికల సమయంలో అంతా కలుస్తారా అనేదే కొంత అనుమానంగా మారింది. నల్గొండ జిల్లాల్లో ఫైర్​బ్రాండ్‌గా చెప్పుకునే రాజగోపాల్​రెడ్డి ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఓ సందర్భంలో హాలియ సభకు వెళ్తా అని… పార్టీ నేతలతో మాత్రం చూద్దాం… అవసరమా అన్నట్టుగా మాట్లాడినట్లు చెప్పుతున్నారు. ఇప్పుడు రాజగోపాల్​రెడ్డి వెళ్తారా… లేదా అనేది కూడా ఉత్కంఠే.

Advertisement

Next Story