పర్యాటక రంగానికి వికీపీడియాతో లింక్!

by  |
పర్యాటక రంగానికి వికీపీడియాతో లింక్!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ పాండమిక్.. పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆర్థిక భారాన్ని తట్టుకోలేమన్న సాకుతో ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు టూరిస్టులను అనుమతిస్తున్నాయి. కానీ పెద్దఎత్తున నిబంధనలు విధించడంతో పర్యాటక అనుభూతిని కోల్పోతున్నట్లు విమర్శిస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకోవడం ఎందుకని ఈ ఏడాది పర్యటన ప్లాన్‌లను వాయిదా వేస్తున్నారు. అలా వాయిదా వేసుకున్న వారిని మళ్లీ ఆకర్షించడానికి వికీపీడియా సాయం తీసుకుంటే పెద్ద మార్పు కనిపిస్తుందని ఇటీవల అధ్యయనంలో తేలింది. పర్యాటక రంగానికి, వికీపీడియాకు సంబంధం ఏంటని ముక్కున వేలేసుకుని మరీ ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవండి.

సాధారణంగా ఎవరైనా కొత్త ప్రదేశాలకు పర్యటనకు వెళ్లడానికి ముందు ఇంటర్నెట్‌లో ఆ ప్రదేశం గురించి వెతుకుతారు. అక్కడి ప్రత్యేకతను వివరించే ఎన్నో ప్రైవేట్ వెబ్‌సైట్‌లు ఉన్నప్పటికీ వికీపీడియా పేజీలనే అందరూ ఎక్కువగా నమ్ముతారు. కానీ చాలా పర్యాటక ప్రాంతాల గురించి వికీపీడియాలో పెద్దగా సమాచారం ఉండదు. ఉన్నా కూడా అది వివిధ భాషల్లో అందుబాటులో ఉండదు. ఈ లోపాన్ని సరిచేస్తూ చిన్న పేరాగ్రాఫ్ గానీ లేదా హై క్వాలిటీ చిత్రాన్ని కానీ అప్‌లోడ్ చేస్తే ఊహించని రీతిలో పర్యాటకులు పెరుగుతారని ఇటలీలోని ట్యూరిన్‌కు చెందిన కాలేజీయో కార్లో ఆల్బెర్టోకు చెందిన ఆర్థికవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. స్పెయిన్‌లో కొన్ని పర్యాటక ప్రాంతాల వికీపీడియా పేజీలలో ఈ ఆర్థికవేత్తలు కొత్త డేటాను, కొత్త ఫొటోలను అప్‌లోడ్ చేశారు. అంతేకాకుండా ఆ వికీపీడీయా పేజీలను ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, డచ్ భాషల్లోకి కూడా అనువాదం చేశారు. అంతే.. వారు ఊహించినట్లుగానే అది చదివి ఆ ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్య పెరిగింది. కొన్ని విశ్లేషణల అనంతరం ఒక చిన్న సిటీకి సంబంధించి వికీపీడియా సమాచారాన్ని మారిస్తే ఆ సిటీని సందర్శించి అదనంగా డబ్బు ఖర్చుపెట్టడానికి పర్యాటకులు సిద్ధంగా ఉంటారని వారు తేల్చిచెప్పారు.


Next Story

Most Viewed