- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధు వెనుక కేసీఆర్ స్నేహితుడు.. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ!
దిశ ప్రతినిధి, ఖమ్మం: రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. ఇన్నాళ్లూ ఏ పదవీ లేకుండా ఉన్న సీనియర్లకు, పార్టీ కోసం కష్టపడ్డవారికి ఇక మంచి రోజులు రానట్టేనా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన సీనియర్లకు అధిష్టానం మొండి చేయి చూపినట్లుగానే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఆశావహులకు అవకాశం రాకపోవడంతోనే ఆయా వర్గాలు నిరాశ చెందాయి. స్థానిక సంస్థల కోటాలో అయినా తమకు అవకాశం రాకపోదా అని ఎదురు చూసిన వారి ఆశలు అడియాశలయ్యాయి. ఎమ్మెల్సీ పదవుల కోసం ఈసారి జిల్లా నుంచి చాలా మంది ట్రై చేశారు. తమకు అవకాశం కల్పించాలంటూ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే గులాబీ బాస్, యువ నేత దృష్టి మాత్రం కొందరిపైనే ఉందని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. జిల్లా నుంచి ఈసారి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బొమ్మెర రామ్మూర్తి, బాలసాని లక్ష్మీనారాయణ వీరిలో ఎవరికైనా ఒకరికి కచ్చితంగా అవకాశం ఉంటుందని అందరూ భావించారు. కానీ అధిష్టానం మాత్రం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు వైపు మొగ్గు చూపింది.
సీనియర్లకు మంచిరోజులు రానట్టేనా..?
తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో వీరు తెలియని వారుండరు. అలాంటిది టీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి ప్రాధాన్యత రోజురోజుకూ పార్టీ తగ్గిస్తూ వచ్చింది. చివరికి ఎలాంటి పదవులు లేకుండా చేయగలిగింది. దీంతో ఇద్దరు సీనియర్ నేతలూ సైలెంట్ గానే ఉన్నారు. ఇద్దరు నేతలకూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్ ఉంది. అభిమానులూ ఎక్కువే. తమ నాయకులను గులాబీ పెద్దలు కావాలనే పక్కకు పెట్టారని వారి అనుచరగణం, అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో పార్టీ మారాలంటూ ఒత్తిడి సైతం చేశారు. కానీ తుమ్మల, పొంగులేటి ఇద్దరికీ పార్టీ పెద్దల నుంచి ఎప్పటికప్పుడు హామీలు వస్తూనే ఉన్నాయి తప్ప పదవి మాత్రం రావడం లేదు. ఇప్పుడు చివరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కూడా కల్పించలేదని ఆ ఇద్దరు నేతల అభిమానులు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈసారి వస్తుందనుకుంటే..
ఇక ఉద్యమ నాయకుడిగా పేరున్న బొమ్మెర రామ్మూర్తి పేరు సైతం ప్రచారం జరిగింది. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికే ఎన్నో కేసులు అతనిపై నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఎలాంటి పదవి అనుభవించని తనకు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని భావించారు. ఇటీవల మంత్రి పువ్వాడ స్వయంగా కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి బొమ్మెరతో వినతిపత్రం కూడా ఇప్పించారు. కానీ బొమ్మెరకు దక్కకపోవడంతో రాష్ట్రస్థాయి పదవి ఏదైనా ఇవ్వాలని కోరుతున్నారు.
తెరపైకి వద్దిరాజు పేరు..
ఒకసారి ఎమ్మెల్సీగా ఖమ్మం జిల్లా నుంచి వద్దరాజు రవిచంద్ర( గాయత్రి రవి) పేరు వినిపించింది. 2018 ఎన్నికల్లో వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చారు. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా ఆయనను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. పార్టీలో చేరే సందర్భంలో సముచితమైన పదవి ఇస్తామని ఆనాడు పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన పదవి లేకపోయినా పార్టీ కోసం అహర్నిశలూ పాటు పడుతూనే ఉన్నారు. 2020లో జరిగిన మేడారం సమ్మక్క – సారక్క జాతరలో కూడా గాయత్రి రవి కీలక భూమిక పోషించారు. జాతరకు శాశ్వత డోనర్ గా ఉంటూ.. అమ్మ వారి గద్దెల అభివృద్ధి.. మూడు రోజుల పాటు అలంకరణ బాధ్యతలు నిర్వహించి సీఎం కేసీఆర్ ప్రశంసలు అందుకున్నారు. మొన్నటి హుజురాబాద్ ఎన్నికల్లో కీలకంగా ఉన్న మున్నూరు కాపుల ఓట్లను టీఆర్ఎస్ పార్టీకి బదలాయించడానికి అక్కడ సుమారు 20 వేల మందితో భారీ బహిరంగసభ నిర్వహించడంలో.. ఆ తరువాత ప్రచారంలో అక్కడే మకాం వేసి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం శాయశక్తుల కృషి చేశారు. పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాదనకుండా.. వెనుకడుగు వేయకుండా గాయత్రి రవికి కచ్చితంగా అవకాశం వస్తుందనుకున్నా అది మాత్రం నెరవేరలేదు.
మంత్రి పదవిపైనే ఇద్దరి గురి..
పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్సీ చేసేందుకు పార్టీ అధిష్టానం సుముఖంగానే ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే తమను మంత్రిని చేస్తేనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వండంటూ ఇద్దరూ అధిష్టానం పెద్దలకు గతంలోనే చెప్పించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సందర్భం వస్తే ఖమ్మం నుంచి ఈ ఇద్దరు నేతల్లో ఎవరికైనా మంత్రి పదవి వరించొచ్చనే ప్రచారం జరిగింది. కానీ అది కూడా ఇప్పట్లో జరిగేట్లు కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వారి అనుచరగణం ప్రచారం చేసుకుంటోంది. ఎప్పటినుంచే వీరిని పక్కకు పెట్టిన అధిష్టానం ఈసారి కూడా మొండిచేయి చూపడంతో ఇద్దరు నేతల అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
సీనియర్లను కాదని..
ఇంతమంది సీనియర్ నేతలు జిల్లాలో ఉంచుకుని తాతా మధు పేరును అధిష్టానం ఖరారు చేయడంలో ఏదో మతలబు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇద్దరు నేతలు పొంగులేటి, తుమ్మల ఎప్పటి నుంచో పదవి ఆశిస్తున్నారు. వారి అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఒకరిని ఎమ్మెల్సీ చేస్తే వేరే వర్గం నుంచి ఆగ్రహం వస్తుందనే తాతా మధు పేరును పార్టీ పెద్దలు ఖరారు చేసినట్లు ఓ ప్రచారం జరుగుతుంటే.. ఈ ఇద్దరిలో ఎవరికీ పదవి రాకుంటే వేరే వర్గం అడ్డుకుందని మరో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండడం తప్ప తాతా మధు ప్రభావం జిల్లాపై పెద్దగా లేకున్నా ఆయన్ను ఎమ్మెల్సీగా చేయడం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.