గులాబీ ముఖ్య నేతలకి కూడా ఆ విషయం తెలియదా..?

by Anukaran |   ( Updated:2020-12-17 08:40:04.0  )
గులాబీ ముఖ్య నేతలకి కూడా ఆ విషయం తెలియదా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్​ ఢిల్లీ పర్యటన తర్వాత గులాబీ శ్రేణుల్లో పరిస్థితి గుంభనంగా మారింది. సీనియర్లు మొత్తం సైలెంట్​ అయ్యారు. అసలేమిటి దీనికి ప్రధాన కారణం. ఎందుకీ పరిస్థితి. చీటికీమాటికీ… అవకాశం దొరికితే మైక్​లందుకుని బీజేపీపై అస్త్రాలు సంధించే పార్టీ సీనియర్లు మొత్తం నిశబ్ధం వాతావరణంలో పడిపోయారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్​ టాపిక్​గా మారింది. ఢిల్లీ నుంచి రావడంతోనే సీఎం కేసీఆర్​ ఫాంహౌస్​కు వెళ్లిపోయారు. అసలేం జరిగిందనే విషయం ఇప్పుడు పార్టీ ముఖ్య నేతలకు కూడా తెలియదు. ఢిల్లీ పరిణామాలు ఏం జరిగాయి… ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేది పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ.

అంతా సైలెంట్​

మొన్నటిదాకా బీజేపీని దుమ్మెత్తి పోశారు. మున్సిపల్​ ఎన్నికలకు అమిత్​షా, కేంద్ర మంత్రులు ఎందుకు వచ్చారంటూ సీఎంతో సహా మంత్రులంతా ప్రశ్నించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీనే ప్రధాన శత్రువుగా మారింది. ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఉన్నఫళంగా ఢిల్లీ బాట పట్టారు. నిన్నటిదాకా తిట్టిపోసిన కేంద్ర మంత్రుల దగ్గరకు వెళ్లారు. ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులు అమిత్​షా, గజేంద్రషెకావత్​, పూరీని కలిశారు. అసలు కారణాలు ఎవరికీ అంతుచిక్కకుండానే ఉన్నాయి. అటు ప్రగతి భవన్​ నుంచి విలువైన ఫైళ్లు కేంద్రం చేతుల్లోకి వెళ్లడంపై కూడా ఢిల్లీ నుంచి రాగానే సీఎం కేసీఆర్​ ఫైర్​ అయినట్లు చెప్పుతున్నారు.

ప్రతిసారి బీజేపీపై విరుచుకుపడటం గులాబీ నేతలకు పరిపాటే. కానీ ఈసారి మాత్రం ఢిల్లీ పర్యటన పార్టీలో నిశబ్ధవాతావరణాన్ని నెలకొల్పింది. మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి, తలసాని వంటి వారితో పాటుగా సీనియర్లంతా నోరెత్తడం లేదు. కనీసం సీఎం ఢిల్లీ టూర్​పై ఎలాంటి ప్రస్తావన లేదు. ఎందుకు వెళ్లారు, కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందనే అంశంపై కనీసం గుసగుసలు కూడా చెప్పుకోవడం లేదు. పార్టీ సీనియర్లను సైలెంట్​గా ఉండాలంటూ గులాబీ బాస్​ నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పుతున్నారు.
మరోవైపు ఢిల్లీ టూర్​పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే… టీఆర్​ఎస్​ నేతలు సమర్థింపులకు దిగుతున్నారు. కేంద్రంతో చాలా పనులు ఉంటాయని, ప్రధానిని కలిసి వస్తే ఎందుకు చర్చ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఈసారి ఆరోపణలపై జూనియర్లతో సమాధానం చెప్పిస్తున్నారు. బాల్క సుమన్​తో ప్రెస్​మీట్​ పెట్టించారు. అంతేకానీ ప్రతిసారి రెచ్చిపోయినట్టుగా మంత్రి కేటీఆర్​, ఇతర మంత్రుల బృందమో బయటకు రాలేదు. ఎదురుదాడులు చేసే నేతలు ఒక్కసారిగా ముఖం చాటేశారు. తప్పలేని పరిస్థితుల్లో జూనియర్లను మీడియా ముందుకు పంపుతున్నారు.

వాట్​ నెక్స్ట్​

రాష్ట్రంలో గులాబీ శ్రేణుల్లో సమాధానం దొరకని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. సీఎం ఆకస్మిక పర్యటనపై గందరగోళం నెలకొంది. అంతేకాకుండా సీఎం రాష్ట్రానికి వచ్చిన కొద్ది గంటల్లోనే కేంద్రం నుంచి కాళేశ్వరం మూడో టీఎంసీపై ముందుకు వెళ్లవద్దంటూ సూచించారు. అటు ఏపీకి అండగా ఉంటూనే తెలంగాణపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కానీ రాష్ట్రం నుంచి మాత్రం సరైన సమాధానం కేంద్రానికి వెళ్లడం లేదు. దీంతో కేంద్రంతో ఏం జరిగిందనే అంశంపైనే చర్చించుకుంటున్నారు. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన సాయం అందడం లేదు. వరద సాయంపై ఎంత మొత్తుకున్నా… బతిమిలాడినా రూపాయి ఇవ్వడం లేదు. పంటల నష్టం కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవహారంపై అసంతృప్తి ఉన్నా… గులాబీ అధిష్టానం మాత్రం మౌనం పాటించడం పార్టీ నేతలను ఇరుకున పెడుతోంది.

రైతుల మద్దతు ఎలా..?

ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్​… రైతుల అంశంపై కేంద్రాన్ని నిలదీస్తారని భావించారు. దీనికి రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు కూడా మరోసారి నిరసనలకు దిగాలని సిద్ధమయ్యాయి. బోర్డర్​లో ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా సీఎం కేంద్రాన్ని అడుగుతారనుకున్నారు. కానీ అక్కడ ఏమైందో కానీ ఆ అంశమే లేదు. భారత్​బంద్​ రోజు నిరసనల్లో పాల్గొన్న టీఆర్​ఎస్​… ఇప్పటి వరకు మళ్లీ ఊసెత్తడం లేదు. అసలే రైతుల అంశం… ఇప్పుడు మరింత అగ్గిరాజుకుంది. ఈ సమయంలో అన్ని రాష్ట్రాల్లో మద్దతు పెరుగుతోంది. కానీ టీఆర్​ఎస్​ నుంచి మాత్రం మళ్లీ ఎలాంటి ఆదేశాలు రావడం లేదు. ఢిల్లీకి వెళ్లిన సీఎం… కేంద్రంతో ఈ విషయమే చర్చించలేదని స్పష్టమవుతోంది. ఒకవేళ చర్చిస్తే దాన్ని చాలా ప్రచారం చేసుకుంటారు. రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్​ను అభివర్ణించుకుంటారు. కానీ అదేమీ లేదనేది తెలిసిపోతోంది. మరి ఇప్పుడు రైతు అంశంలో ఏం చేస్తారనేది అటు పార్టీ శ్రేణులకు కూడా అంతు చిక్కడం లేదు.

అధికారులేం చేస్తున్నారో…?

అసలు రాష్ట్రంలో పాలనా యంత్రాంగం పడకేసింది. అధికారులు కనీస విధులకు కూడా దూరమయ్యారు. ఐఏఎస్​ల మధ్య విభేదాలు మరింత రాజుకుంటున్నాయి. ఎవరి పనుల్లో వారు కూడా శ్రద్ధ చూపించడం లేదు. సీఎస్​ వ్యవహారంపై తిరుగుబాటు మొదలైంది. సీఎం కేసీఆర్​కు ఐఏఎస్​లు లేఖ రాయడంతో సీఎస్​ కూడా వారిపై పగ పెంచుకుంటున్నారు. మరోవైపు సీఎస్​ అంశంలో సీఎం కూడా సీరియస్​గా ఉంటున్నారు. ధరణి విఫలం, ఎల్​ఆర్​ఎస్​ వంటి అంశాల్లో సీఎస్​ నిర్లక్ష్య వైఖరిని బయట పడేశాయి. కానీ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై సీఎం దృష్టి సారించినట్లు అధికార వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

సారును కలవాలి… ఎలా ..?

రాజకీయ నేతలకు నామినేటేడ్​ అశలు మొదలయ్యాయి. ఎలాగూ నామినేటేడ్​ పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడైంది. దీంతో ఏండ్ల నుంచి ఒక్క పోస్టు కోసం ఎదురుచూస్తున్న వారంతా నేతల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. కానీ వారి దగ్గర కూడా ఏం సమాధానం రాకపోవడంతో పెద్దసారును కలువాలని తహతహలాడుతున్నారు. కానీ సీఎం కేసీఆర్​ అప్పాయింట్​మెంట్​ దొరకడం ఎలాగో తెలియడం లేదు. సీఎం ఫాంహౌస్​కు వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి రాగానే అటే వెళ్లారు. మంత్రి కేటీఆర్​ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా… సాధ్యం కావడం లేదు. మంత్రి దగ్గర నుంచి హామీ రావడం లేదు. ఎవరికి వస్తుందో… ఎవరికి ఇస్తారో కూడా తెలియని పరిస్థితులు. కొంతమందికి మంత్రి కేటీఆర్​ నుంచి హామీ వచ్చినా… ఇప్పుడు ఏ మేరకు ఫలిస్తుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో గులాబీ అధిష్టానాన్ని కలుసుకోవడం ఎలాగో తెలియక ప్రగతి భవన్​ ఎదుట పడిగాపులు పడుతున్నారు. కానీ వారికి పెద్దసారు కలిసే అవకాశమైనా దొరుకుతుందో… చూడాల్సిందే పాపం.

Advertisement

Next Story