ఆ విమాన పార్కింగ్ ఫీజు రూ. 1.25 కోట్లు

by Sujitha Rachapalli |
ఆ విమాన పార్కింగ్ ఫీజు రూ. 1.25 కోట్లు
X

దిశ, ఫీచర్స్ : ఏరోప్లేన్ టేకాఫ్ అయిన తర్వాత అందులో ఏదైనా లోపమున్నా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తినా విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ విమానయాన సంస్థ ‘యునైటెడ్ ఎయిర్‌వేస్’కు చెందిన విమానం ఢాకా నుంచి మస్కట్‌కు వెళ్లే సమయంలో(ఆగస్టు 7, 2015న రాత్రి 7 గంటలకు) ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా. చత్తీస్‌గఢ్‌‌లోని రాయ్‌పూర్ స్వామి వివేకానంద విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 2015 నుంచి ఇప్పటివరకు ఆ విమానం అక్కడే ఉండగా, దాని పార్కింగ్ ఫీజు 1.25 కోట్లు దాటింది. మరి ఆ పార్కింగ్ ఫీజు చెల్లిస్తారా? విమానాన్ని ఇప్పుడైనా తొలగిస్తారా? అసలు ఇన్ని సంవత్సరాలుగా దాన్ని అక్కడే ఎందుకు వదిలేశారు?

మెక్‌డొనెల్ డగ్లస్ ఎండీ-83 మోడల్‌కు చెందిన బంగ్లాదేశ్ విమానం గగనతలంలో ప్రయాణిస్తుండగా ఇంజిన్‌లో మంటలు రావడంతో రాయ్‌పుర్‌ విమానాశ్రయంలో 2015 ఆగస్టు 7న అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పుడు విమానంలో 173 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో ఇంజిన్‌ నుంచి విడిపోయిన ఓ భాగం విమానం గాల్లో ఉండగానే కిందపడిపోగా, విమానం మాత్రం సేఫ్‌గానే దిగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాతి రోజున యునైటెడ్ ఎయిర్‌వేస్.. మరో ప్రత్యేక విమానంలో ప్రయాణికులను అక్కడి నుంచి తరలించింది. ఇక ల్యాండింగ్ చేసిన 24 రోజుల తర్వాత రాయ్‌పూర్‌కు వచ్చిన యునైటెడ్ ఎయిర్‌వేస్ అధికారులు.. ఇంజిన్ మార్చేందుకు అనుమతి ఇవ్వాలని భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్‌కు అభ్యర్థనపెట్టి తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయారు. ఆ తర్వాత రాయ్‌పుర్ విమానాశ్రయం అధికారులు యునైటెడ్ ఎయిర్‌వేస్‌ సంస్థకు చాలా సార్లు ఫోన్ కాల్స్, మెయిల్స్ చేసినా స్పందన రాలేదు. ఇదిలా ఉండగా 2016 మార్చి 6న యునైటెడ్ ఎయిర్‌వేస్ సంస్థ తమ కార్యకలాపాలను నిలిపివేయడం గమనార్హం.

‘మాది అంతర్జాతీయ విమానాశ్రయం కాదు, అంతర్జాతీయ విమానాలను ఇక్కడ ల్యాండ్ చేయలేం. కానీ ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి, మేము దాన్ని అనుమతించాం. రాయ్‌పూర్ విమానాశ్రయానికి ఎనిమిది విమానాల పార్కింగ్ సామర్థ్యం ఉండగా యునైటెడ్ ఎయిర్‌వేస్ విమానం అక్కడ చాలా స్థలాన్ని ఆక్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఐదేళ్లలో దాని పార్కింగ్ ఫీజు 1.25 కోట్లు దాటింది. గత ఐదేళ్లలో ఆ విమానం విషయమై దాని యాజమాన్య సంస్థకు 50కు పైగా మెయిల్స్ చేశాం. అయినా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. 2021 జనవరి 4న, ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ద్వారా ఆ విమాన తొలగింపునకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాం. విమానాన్ని అమ్మేసి కట్టాల్సిన పార్కింగ్ ఫీజును కడతామని ఆ సంస్థ మాకు హామీ ఇచ్చింది. అందుకు తొమ్మిది నెలల డెడ్‌లైన్ కావాలని కోరింది. ఈ విషయమై న్యాయపరమైన సలహా తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వస్తాం’ అని రాయ్‌పుర్ విమానాశ్రయం డైరెక్టర్ రాకేశ్ సహాయ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed