‘బల్దియా’ చీకటి కోణాలు.. బయటపడేదెప్పుడో..!

by Anukaran |   ( Updated:2021-07-17 21:40:27.0  )
ghmc 1
X

దిశ, సిటీ బ్యూరో : మహానగర పాలక సంస్థలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న అధికారుల వైఖరిపై శానిటేషన్ విభాగంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి బల్దియాకు డిప్యూటేషన్ పై వచ్చిన దాదాపు 16 మంది సహాయ వైద్యాధికారులు జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్నారు. వారంతా ఆయా సర్కిళ్లలో శానిటేషన్ పనులు, బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ, ట్రేడ్ లైసెన్సుల జారీ వంటి ఇతరాత్ర విధులు నిర్వహిస్తుంటారు. దీనికి తోడు వీరిలో అక్రమార్కులైన కొందరు అధికారులు శానిటరీ ఫీల్డు అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ), స్వీపర్ల రక్తం పీల్చే జలగల్లా మారారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సు ప్రాతిపదికన విధులు నిర్వర్తించే సుమారు 18 వేల మంది శానిటేషన్ సిబ్బందిలో అత్యధిక శాతం సిబ్బంది వీరి వేధింపులను తట్టుకున్న వారే. తాజాగా ఇద్దరు గోషామహల్ సర్కిల్ కు చెందిన కార్మికులు శనివారం ఏకంగా బల్దియా ప్రధాన కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో బైఠాయించారు.

నెలకు రూ. 6 వేలను మామూళ్లుగా ఇవ్వమని మెడికల్ ఆఫీసర్ ఉమా గౌరీ డిమాండ్ చేస్తున్నారని ఒకరు, తనను అనవసరంగా విధుల్లో నుంచి తొలగించారని, కనీసం తన స్థానంలో తన కుటుంబ సభ్యులను కూడా నియమించలేదని మరొకరు తమ కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు. వీరిలో ఒకరు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, విధి నిర్వహణలోనున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. ఇలా మొత్తం 30 సర్కిళ్లలో వందలాది మంది ఈ మెడికల్ ఆఫీసర్ల బాధితులుంటారని, వారిలో కొందరు ధైర్యం లేక తమ బాధను బయటకు చెప్పుకోలేక పోతున్నారని కొందరు బాధితులు వెల్లడించారు. స్వీపర్లు, ఎస్ఎఫ్ఏలకు జీతాల చెల్లింపులోనూ వీరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రస్తుతమున్న మెడికల్ ఆఫీసర్లలో ఎక్కువ మందిపై ఆరోణలున్నాయి. కార్పొరేషన్ 18 వేల మందికి జీతాలను చెల్లిస్తున్నా, వీరిలో ఎక్కువ మంది బోగస్ కార్మికులు, ఎస్ఎఫ్ఏల కుటుంబ సభ్యులున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ బోగస్ కార్మికుల అటెండెన్స్ ను ఆమోదించే పవర్ ఈ మెడికల్ ఆఫీసర్లకే ఉండటంతో చాలా సర్కిళ్లలో వీళ్లు ఎస్ఎఫ్ఏలతో కుమ్మక్కై బోగస్ కార్మికుల జీతాలను పంచుకుంటున్నట్లు సమాచారం. ఒక్కసారి బల్దియాలోకి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లుగా ఎంటరైన వీరిలో ఎక్కువ మంది డిప్యూటేషన్ గడువు ముగిసినా, మాతృశాఖకు వెళ్లకుండా ఇంకా సీట్లకు అతుక్కుపోయారు. ఈ కమ్రంలో శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న స్వీపర్లు, ఎస్ఎఫ్ఏల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు దాటిన వారున్నారని, వారిని విధుల నుంచి తొలగించి వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను ఎవరినైనా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం బల్దియాకు 2016లోనే లిఖితపూర్వకమైన ఆదేశాలిచ్చింది.

60 ఏళ్ల పైబడిన వారిని తొలగించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు వీరికి వరంగా మారాయి. ఇప్పటి వరకు 30 సర్కిళ్లలో కలిపి సుమారు 1200 మంది కార్మికులను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులను కాకుండా బయటి వారిని వీరి స్థానాల్లో నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 2 నుంచి 3 లక్షలిచ్చిన వారిని స్వీపర్లుగా, రూ.4 లక్షల నుంచి ఐదు లక్షలిచ్చిన వారిని ఎస్ఎఫ్ఏలుగా ముందే బేరం కుదుర్చుకుని తొలగించిన కార్మికుడి కుటుంబ సభ్యులకివ్వాల్సిన పోస్టుల్లో వేరే వారిని నియమించినట్లు ఆరోపణలున్నాయి.

ఇదిలా ఉండగా, ఆబిడ్స్ లోని మున్సిపల్ కాంప్లెక్సులో మెడికల్ ఆఫీసర్ విధులు నిర్వర్తించే ఓ అధికారి 60 ఏళ్ల పైబడిన కార్మికులను తొలగిస్తే ఖాళీ అయిన ఒక్కో పోస్టుకు ఇద్దరు, ముగ్గురి నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసుకుని నేటికీ తమ ఆఫీసు చుట్టూ తప్పించుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. సికింద్రాబాద్‌లో ఓ ఎస్ఎఫ్ఏ స్వీపర్ల లిస్టులో తన భార్య పేరును చేర్చి, ఆమె పని చేయకున్నా, ఆమెతో ఇంట్లోనే బయోమెట్రిక్ అటెండెన్స్ వేయిస్తూ ప్రతి నెల జీతం డ్రా చేస్తున్నాడు. ఇది గుర్తించిన మెడికల్ ఆఫీసర్ కు ఎస్ఎఫ్ఏ పెద్ద మొత్తంలో అప్పజెప్పటంతో సదరు అధికారి మౌనం వహించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటి పనులు సైతం..

క్షేత్ర స్థాయిలో శానిటేషన్ పనులను పర్యవేక్షించటం మెడికల్ ఆఫీసర్ల తర్వాత ఎస్ఎఫ్ఏలు చూస్తుంటారు. దాదాపు చాలా సర్కిళ్లలో వీరిద్దరి కుమ్మక్కై ఉంటారు. స్వీపర్ల బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత ఎస్ఎఫ్ఏ సార్, మేడమ్ గారి ఇంటి పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కమ్రంలో స్వీపర్లపై ఎస్ఎఫ్ఏ హవా నడిపిస్తుంటాడు. ఉదయం టిఫిన్ మొదలుకుని రాత్రి భోజనాల వరకు, అలాగే వారంతపు రోజుల్లో అవసరమైన అన్ని సరుకులను వీరే సమకూరుస్తుంటారు. కానీ మెడికల్ ఆఫీసర్లు వీరికి పైసా ఇవ్వరు. వీరు కార్మికుల శ్రమను దోచుకుని సార్లకు ఇలా మర్యాదలు చేస్తుంటారన్న ఆరోపణ చాలా బలంగా ఉంది. వీరి ప్రవర్తనలో ఏ మాత్రం తేడా కన్పించినా ఏదో ఓ ఆరోపణ పెట్టి, మెడికల్ ఆఫీసర్లు నేరుగా ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రాస్తుంటారు. ఇలా ఎంతో మంది బలై, ఉద్యోగాలు కోల్పొయి రోడ్డున పడిన సందర్భాలున్నాయి.

ఇలా ఓ ఎస్ఎఫ్ఏను బలి చేసి బల్దియా నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చి ప్రస్తుతం చార్మినార్ జోన్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 2010లో సెంట్రల్ జోన్ లోని ఓ సర్కిల్ కు మెడికల్ ఆఫీసర్ గా పని చేసి చెత్తను సేకరించే ట్రైసైకిళ్ల కొనుగోళ్లలో రూ.14 లక్షలను కాజేసి, ఎవరికెలాంటి సమాచారమివ్వకుండా విదేశాలకు వెళ్లిపోయి, మళ్లీ వచ్చి పదేళ్ల క్రితం పనిచేసిన సర్కిల్ కే మళ్లీ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారంటే జీహెచ్ఎంసీలో ఎంత గొప్ప పాలన కొనసాగుతుందో అంచనా వేసుకోవచ్చు. శానిటేషన్ విభాగంలో ఎంత మంది కార్మికులున్నారు, క్షేత్ర స్థాయిలో ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారన్న అంశంపై ఇతర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే కళ్ల బైర్లు గమ్మె వాస్తవాలు, స్కామ్, అవకతవకలు బయటపడుతాయని కార్మికులే బాహాటంగా చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed