వరద సాయం ఇక అంతేనా..!

by Anukaran |
వరద సాయం ఇక అంతేనా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో సర్కారు ఇచ్చే వరద సాయం ముగిసినట్లేనని తెలుస్తోంది. ఎన్నికల ముందు కొందరి బాధితులకు అందిన సాయమే తప్ప కొత్తవారికి ఇచ్చింది లేదు. డిసెంబర్ 7వ తేదీ నుంచి ముంపు బాధితులకు సాయం అందజేసే కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుందన్న సీఎం కేసీఆర్ మాటలు ప్రస్తుత వాతావరణాన్ని చూస్తుంటే పక్కనెట్టినట్టే తెలుస్తోంది. ఏడో తేదీ నుంచి బాధితులు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడంతో అప్పటివరకూ ఉన్న పద్ధతిలో మీసేవా కేంద్రాలకు ప్రజలు భారీగా చేరుకున్నారు.

ఈ క్రమంలో దరఖాస్తులను మీసేవా కేంద్రాల ద్వారా తీసుకోవడం లేదని, అధికారులే క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను గుర్తించి సాయమందిస్తారని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ప్రకటించాల్సి వచ్చింది. ఏడో తేదీనుండి వరదసాయం కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కేటీఆర్ కూడా ప్రకటించారు. కానీ ఆ రోజు లబ్దిదారుల గుర్తింపు జరగలేదు. ఎవరి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం మరో ప్రకటన చేశారు. ఈ నెల 8న 7,939 మందికి వరద సాయాన్ని జమ చేశామని తెలిపారు. వరుసగా మూడు రోజుల నుంచి 28 వేల మందికి సాయమందించారు. వీరంతా ఎన్నికల ముందు దరఖాస్తులను సమర్పించినవారే కావడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించినట్టు ఏడో తేదీ నుంచి కొత్తగా బాధితులను గుర్తించడం లేదు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

గతంలో ప్రభుత్వం వరద సాయం కింద రూ. 650 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఇంటింటికి వెళ్లిన లబ్దిదారులు కాకుండా మీసేవా కేంద్రాల ద్వారా మూడు లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తులు అందిన రాత్రే సగటున రోజూ రూ.55 కోట్ల చొప్పున ఖాతాల్లో జమ చేశారు. రెండు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం నత్తనడకన పంపిణీ కార్యక్రమం చేపడుతోంది. మూడు రోజుల్లో కేవలం రూ.28.44 కోట్లు మాత్రమే జమ చేసింది.

పెండింగ్‌లోనే ఎక్కువ

మీసేవా కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తుల్లో రెండు లక్షల వరకూ పెండింగ్‌లో ఉండగా ఇప్పటి వరకూ 28,436 మందికి మాత్రమే సాయమందినట్టు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ పూర్తి కావాలంటే నెల రోజులు పడుతుంది. ఈ దరఖాస్తుల చెల్లింపు పూర్తయిన తర్వాత కొత్తగా లబ్దిదారుల గుర్తింపును ప్రారంభిస్తామంటున్నారు. ఈ క్రమంలో ఇలా వాయిదా పద్ధతిలో చెల్లింపులు జరపడం వల్ల వరద సాయం వచ్చేదిలేదని ప్రజలను మానసికంగా సిద్ధం చేయడమేనని తేలిపోతున్నది.

స్పష్టత లేదంటున్న ఆఫీసర్లు

జీహెచ్ఎంసీ అధికారులు సైతం రోజూ వారీగా ప్రభుత్వం వారిచ్చిన గణంకాలను చదివి చెబుతున్నారు తప్ప నాలుగైదు రోజులైనా ముంపు ప్రాంతాల వైపు వెళ్లలేదు. ఆదేశాలు లేకుండా తాము ఎలా వెళ్లగలమంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తులు ఇచ్చేందుకు మీసేవా, సర్కిల్ కార్యాలయానికి వెళ్తున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఈ విషయంలో తమకే స్పష్టత లేదని, ఉత్తర్వులేవీ రానందున దరఖాస్తులు తీసుకోవడం కుదరదని తిప్పి పంపిస్తున్నారు. దీంతో వారంతా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. అక్కడ కూడా వారికి అవసరమైన సమాచారమేదీ దొరకడం లేదు. వరద సాయం తమ పరిధిలోని అంశమే కాదని కొందరు, ప్రభుత్వం ఆదేశాలిచ్చిన తర్వాత అధికారులు వస్తారని మరికొంతమంది ఆఫీసర్లు చెబుతున్నారు. వరద ప్రకటనలను మాత్రం బల్దియా అధికారులతో చేయిస్తుండటంతో ప్రజలు జీహెచ్ఎంసీ కార్యాలయాలకు తిరుగుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులతో జనాలకు ఏం చెప్పాలో తెలియడం లేదంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక వరద సాయం ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదని, ఇక ముగిసినట్టేనని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story