కరోనా ప్రభావంతో పెరిగిన సోషల్ మీడియా వినియోగం

by Shyam |
కరోనా ప్రభావంతో పెరిగిన సోషల్ మీడియా వినియోగం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 సంక్షోభం కారణంగా ప్రజలందరూ ఇంట్లో కూర్చొని తమ మిత్రులు, కుటుంబంతో ఆన్‌లైన్ ద్వారా కనెక్టవడంతో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రముఖ ఇన్‌సైట్స్ కంపెనీ కంటార్ వారు నిర్వహించిన సర్వేలో ఈ విషయానికి సంబంధించిన డేటా బయటపడింది. మార్చి 14 నుంచి 24 వరకు దాదాపు 30 మార్కెట్లలోని 25000 మంది వినియోగదారులను సర్వే చేసి కంటార్ కంపెనీ ఈ డేటాను విడుదల చేసింది. మిగతా సోషల్ మీడియా యాప్‌లతో పోల్చితే వాట్సాప్ ఎక్కువ లాభపడినట్లు ఈ డేటా ద్వారా తెలిసింది.

పాండమిక్ ప్రారంభమైన మొదట్లో వాట్సాప్ వాడకం 27 శాతం పెరగగా, మధ్యస్థానికి వచ్చేసరికి 40 శాతం పెరిగినట్లు నివేదిక తేల్చిచెప్పింది. పాండమిక్ చివరి స్థాయిలో ఉన్న దేశాల్లో వాట్సాప్ వాడకం 51 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది. 18 నుంచి 34 ఏళ్ల వయసున్న వాళ్లే ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వాడకాలు కూడా 40 శాతానికి పెరిగినట్లు కంటార్ వెల్లడించింది. ఓవరాల్‌గా ఫేస్‌బుక్ వాడకం 37 శాతం, చైనా వారి వియ్‌చాట్ యాప్ 58 శాతం పెరిగినట్లు కంటార్ నివేదిక ప్రకటించింది.

మరోవైపు వాడకం సంగతి పక్కన పెడితే కచ్చితమైన సమాచారం విషయంలో తాము సోషల్ మీడియాను నమ్మబోమని వినియోగదారులు తెలిపినట్లు కంటార్ వెల్లడించింది. సరైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగదారులు నమ్ముతున్నారని వారు తెలిపారు. అంతేకాకుండా ఫేస్‌బుక్ ప్రత్యేకంగా విడుదల చేసిన డేటాలో వీడియో కాల్స్ గత నెలరోజుల్లో 50 శాతానికి పైగా పెరిగినట్లు పేర్కొంది. ఇక ఇన్‌స్టాగ్రాం లైవ్‌లు, స్టోరీలు, స్టేటస్‌లు కూడా అమాంతం 70 శాతానికి చేరుకున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉన్నవారికి సోషల్ మీడియా మినహా వేరే దారి లేకపోవడంతో ఈ పెరుగుదల కనిపించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags – Facebook, Whatsapp, Usage, growth, Kantar, Video calls, Insta lives, Video calls

Advertisement

Next Story