ఉస్మానియాలో ఆరోజు ఏమైందంటే..?

by Shyam |
ఉస్మానియాలో ఆరోజు ఏమైందంటే..?
X

దిశ, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య చికిత్సలపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలోనే తాజాగా హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన వరుస ఘటనలు కలకలం రేపాయి. బతికే ఉన్న ఓ మహిళ పేషంట్ చనిపోయిందంటూ బంధువులకు సిబ్బంది ఫోన్ చేసి చెప్పడంతో బాధితులు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. చివరకు మృతి చెందింది ఓ గుర్తు తెలియని మహిళా కావడంతో అది కాస్తా వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా.. ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో స్పందించడం లేదంటూ మరో రోగి బంధువులు కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వరుస సంఘటనల్లో ఇద్దరు మహిళా రోగుల పేర్లు ఒక్కటే కావడంతో.. మంత్రికి ఎవరు ఫిర్యాదు ఎవరు చేశారో తెలియక అధికారులు గందరగోళంలో పడ్డారు.

వివరాళ్లోకి వెళితే:

ఉస్మానియా ఆస్పత్రిలో ఈ నెల 20వ తేదిన ఒకే పేరుతో ఉన్న ఇద్దరు మహిళలు కరోనా లక్షణాలతో వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. వీరిలో ఒకరు స్థానిక తలాబ్‌కట్టకు చెందినవారు. మరొక పేషంట్ రెయిన్ బజార్ నివాసి. తలాబ్ కట్టకు చెందిన రోగిని పరీక్షించిన వైద్యులు.. అదే రోజు ఆమెని ఇన్ పేషంట్‌గా చేర్చుకున్నారు. పేషెంట్‌గా అటెండర్‌గా ఆమె భర్త సపర్యలు చేస్తున్నాడు. కాగా, ఆస్పత్రిలో చేర్చుకుని 5 గంటలు అయినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రికి ఫిర్యాదు చేశారని తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు ఏం జరిగింది అంటూ కాసేపు ఉరుకులు పరుగులు పెట్టారు.

ఇక రెయిన్‌బజార్‌కు చెందిన మరో పేషెంట్‌కు కరోనా లక్షణాలు ఉండడంతో ఆమెను కూడా ఇన్ పేషంట్‌గా చేర్చుకున్నారు. అనంతరం పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆదివారం (జూన్21) గాంధీకి తరలించారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో పొరపాటు పడ్డ ఆస్పత్రి సిబ్బంది తలాబ్ కట్టకు చెందిన మహిళ పేషంట్ మృతి చెందిందని బంధువులకు సమాచారం అందించారు. అంతే, తన భార్య బతికే ఉన్న చనిపోయిందని చెప్పడంపై భర్త తీవ్ర ఆగ్రహానికి గురైయ్యాడు. ఈ విషయాన్ని కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై స్పందించిన అధికారులు పొరపాటున జరిగిందని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

అనంతరం ఈ ఘటనలపై ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. నాగేందర్ వివరణ ఇచ్చారు. తలాబ్ కట్టకు చెందిన మహిళ నమూనాలను సేకరించి కరోనా పరీక్షలకు పంపామని చెప్పారు. సిబ్బంది పొరపాటు ఫోన్ చేసి చెప్పడంతో ఈ సమస్య వచ్చిందన్నారు. ఎవరు ఫోన్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చారో విచారణ చేయిస్తున్నామని తెలిపారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని డా. నాగేందర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed