- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ చెప్పినవి.. చెప్పాల్సినవి..!
దిశ, వెబ్‌డెస్క్ : దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో.. అందరూ ఊహించినట్టే లాక్‌డౌన్ పొడిగింపు ప్రకటన వెలువడింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ తప్పదన్న నిపుణులు, సీఎంల సూచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం వెలువడింది. కానీ, అందరూ చర్చించినట్టు ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కొన్ని మినహాయింపులుంటాయన్న అంశంపై మాత్రం ప్రధాని మాట్లాడలేదు. అయితే, 20వ తేదీ తర్వాత లాక్‌డౌన్ మినహాయింపులపై నిర్ణయాలుంటాయని ఆయన చెప్పారు. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయమైతే తీసుకున్నారు గానీ, గడిచిన 21 రోజుల్లో లాక్‌డౌన్ కారణంగా ప్రజలు అనుభవించిన కష్టాలను, సమస్యలను రెండో దశ లాక్‌డౌన్‌లో ఎలా ఎదుర్కోబోతున్నారనే విషయాల జోలికి ప్రధాని వెళ్లలేదు. ఇంతకూ ప్రధాని మంగళవారం ఉదయం జాతిని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడారు? తప్పక చర్చించాల్సిన విషయాలేవి అనే అంశాలను పరిశీలిద్దాం..
కరోనా ఆపత్కాలంలో ప్రధాని పలుసార్లు జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అందులో చాలా సార్లు పౌరులు ఏం చేయాలో సూచనలిస్తూ కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా ఎటువంటి పనులు చేయాలో వివరించారు. కానీ, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నదనే అంశంపై వివరిచింది స్వల్పం. తాజా ప్రసంగంలోనూ ప్రజలకు సప్త సూచనలు ఇచ్చారు.
ప్రజలకు భరోసా ఇచ్చేందుకు భవిష్యత్ కార్యాచరణ ఏమిటో వివరించడంలో తప్పేమీ లేదు. అయితే, ఈ మూడు వారాల కాలంలోనూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చర్యలనూ చెప్పి కరోనాను ఎలా జయించవచ్చునో పేర్కొనలేదు. వాటిని మాటవరుసకైనా ప్రస్తావించలేదు. ఎంతో ప్రధానమైన ఈ ప్రసంగంలో ఇది వరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌తో వలస కార్మికుల దుస్థితి, దారిద్ర్యం, పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థకు విరుగుడును.. లేదా రెండో దశ లాక్‌డౌన్ అమలుపై నిర్ణయాలను ప్రకటించలేదు. ముఖ్యంగా ప్రజలకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలపైనా మాట్లాడకపోవడంపై ఆయా పార్టీల నేతలు, ఆయా రంగాల నిపుణులు పెదవి విరుస్తున్నాను.
ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
ప్రధాని మోడీ తన ప్రసంగంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ‘భారతీయ ప్రజలమైన మేము’ అనే దానికున్న శక్తిని ఈ లాక్‌డౌన్ కాలంలో భారత పౌరులు నిరూపించారని ప్రధాని అన్నారు. దేశాన్ని వారే కాపాడుతున్నారని తెలిపారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌ను పాటించారని, ఎవరెవరూ ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారో తనకు తెలుసని చెప్పారు. వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచదేశాల పరిస్థితులను చూస్తే మన దేశం కరోనాపై వేగంగా స్పందించి సరైన నిర్ణయాలు తీసుకున్నదని వివరించారు. లాక్‌డౌన్ నిర్ణయంతోనే దేశంలోనే భారీ సంఖ్యలో కరోనా కేసులను నియంత్రించగలిగామని చెప్పారు. వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రాలతో చర్చించే లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. హాట్‌స్పాట్‌లను తగ్గించేందుకు కృషి చేయాలని చెప్పారు. ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం లాక్‌డౌన్‌ను ఎలా అమలు చేస్తున్నాయో.. ఏ మేరకు కరోనాను కట్టడి చేస్తున్నాయో పర్యవేక్షించి ఆయా ప్రాంతాల్లో 20వ తేదీ తర్వాత లాక్‌డౌన్ నిబంధనలను సడలించే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, కరోనాపై పోరాటానికి పౌరులు తప్పకుండా పాటించాలని ఏడు సూత్రాలను సూచించారు. పెద్దలను, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలున్నవారిని జాగ్రత్తగా చూసుకోవాలని, ఇంట్లోనే ఉండాలని, హోమ్ మేడ్ మాస్క్ ధరించాలని సూచించారు. రోగ నిరోధక శక్తి పెరిగే చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య సేతు యాప్‌ను వినియోగించాలని చెప్పారు. పేదలకు వీలైన సహాయం చేయాలని, ఉద్యోగులను తొలగించరాదని యాజమాన్యాలకు సూచించారు. అలాగే, కరోనాతో ముందువరుసల ఉండి పోరుసల్పుతున్న ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులను అభినందించాలని అన్నారు.
ప్రభుత్వం తప్పకుండా గుర్తించి చెప్పాల్సిన విషయాలు :
మోడీ తన ప్రసంగంలో.. లాక్‌డౌన్‌కు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు రేపు విడుదలవుతాయని చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన, బాధపడుతున్నవారికి పరిష్కారాలను, సందేహాలకు సమాధానాలను ప్రసంగంలో ప్రస్తావించకున్నా.. విడుదలయ్యే మార్గదర్శకాల్లో తప్పకుండా ఉండాలని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
– పనిచేస్తున్న చోట లేదా ఆశ్రయాల్లో చిక్కుకున్న వలసకార్మికులను స్వరాష్ట్రాలకు తరలిస్తారా?
– ఒకవేళ ఈ కార్యం వీలుపడకుంటే.. వారికి ఆహారం, నిత్యావసర సరుకుల సరఫరాపై ఏ ప్రణాళికలున్నాయి?
– ఒకవేళ వారున్న షెల్టర్లు అపరిశుభ్రంగా… వైరస్ వ్యాప్తికి అనువుగా ఉంటే పరిష్కారాలేమిటి?
– లాక్‌డౌన్ కాలంలో పోలీసులు అతిగా వ్యవహరించరాదని ఆదేశాలు జారీ చేస్తుందా?
– గోదాముల్లో మూలుగుతున్న అదనపు ధాన్యాన్ని రాష్ట్రాలకు కేంద్రం అందిస్తుందా?
– రాష్ట్రాలు కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన సొమ్ము కోసం.. కేంద్రం ఇది వరకే బకాయిపడిన మొత్తాలను విడుదల చేస్తుందా?
– అవసరానికి తగ్గట్టుగా వైద్య సేవలను మరింత పటిష్టంగా, సమర్థవంతంగా అందించేందుకు కేంద్రం ఏం చేసింది? ఏం చేయబోతున్నది?
– వైద్యారోగ్య సిబ్బందికి కావాల్సిన రక్షణ పరికరాల నిల్వలు ఎన్ని ఉన్నాయి? వీటి సరఫరా పెంచేందుకు కేంద్రం ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నది? అలాగే, చికిత్సకు కావాల్సిన పరికరాలను సమకూర్చుకునేందుకు కేంద్రం ప్రణాళికలు ఏమిటి?
– ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఉద్దీపన పథకాలేవైనా ప్రకటిస్తుందా?
– ఆర్థికంగా చతికిలపడి మూసివేతకు గురవుతున్న.. ఉద్యోగాల్లో కోత పెడుతున్న కంపెనీలకు సర్కారు ఏదైనా ఊతాన్ని అందిస్తుందా?
– ప్రజలకు ఆర్థిక మద్దతు కోసం ఏ ప్లాన్స్ ఉన్నాయి?
– ఒకవేళ ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించే ప్రణాళికలుంటే.. పనిచేసే చోట సామాజిక దూరానికి సంబంధించి ఇండస్ట్రీలతో సంప్రదింపులు జరిగాయా?
ఇటువంటి పలు అంశాలపై కేంద్రం తీసుకునే నిర్ణయాలను తప్పకుండా పౌరులకు తెలియజేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags: lockdown, extend, pm modi, speech, national, guidelines, plight, actions