- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురపోరును ఏం చేద్దాం? సందిగ్ధంలో ఎస్ఈసీ
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న మినీ పురుపోరుపై ఏం చేయాలనేది కొంత సందిగ్ధంలో పడింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూనే ఎలక్షన్యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని సలహా కోరింది. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఎన్నికలపై ముందుకెళ్తున్నామని, ప్రచార సమయాన్ని తగ్గించడమే కాకుండా పరిమితులు విధించామని ఎస్ఈసీ స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తెలుపాల్సి ఉంది. బుధవారం సెలవు కావడంతో ఇవ్వాళే చెప్తారా.. లేదా గురువారం ఉదయం వరకు ఎస్ఈసీకి వివరణ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా ఎన్నికలను నిలుపలేదని స్పష్టం చేస్తున్నారు. కోర్టు వివాదాలున్నా… మన కంటే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదువుతున్న రాష్ట్రాల్లో ఎన్నికలను పూర్తి చేశాయంటూ సూచిస్తున్నారు. అయితే ఎన్నికల నిర్వహణలో దాదాపు సగం ప్రక్రియ పూర్తి అయిందని, మరో ఐదు రోజులు గడిస్తే ప్రచారం ముగిసిపోతోందని, ఇప్పుడు ఎన్నికలను ఆపాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ఏడు పురపాలికలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న పోలింగ్ ఉండగా… 28న ప్రచారం ముగుస్తోంది. ఎన్నికలు జరుగుతున్న వాటిలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు మినహా… అన్ని చిన్న మున్సిపాలిటీలే. మరో 8 వార్డులు, 1 డివిజన్కు ఉప ఎన్నికలు ఉండగా… లింగోజీగూడ డివిజన్ ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల పర్వం ముగిసింది. రేపు తుది అభ్యర్థులను ప్రకటించనున్నారు. అటు ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సామగ్రిని సిద్ధం చేసింది. కొవిడ్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రావడంతో ప్రచారాన్ని 8 గంటల వరకే కుదించింది. ఈ సమయంలో కరోనా వ్యాప్తి ఎన్నికలతో సంబంధమేమీ ఉండదని అంచనా వేస్తోంది. కానీ కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీలు మాత్రం ఎన్నికలను వాయిదా వేయాలని కోరాయి.
మరోవైపు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పురపాలికల్లో పాలకవర్గం పదవీకాలం ముగిసింది. ఇవన్నీ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. పాలకవర్గం లేకుండా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వం కూడా భావిస్తోంది. అందుకే ఎన్నికలను పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.
అయితే చాలా రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాప్తి చెందుతున్నా ఎన్నికలను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా వివరిస్తున్నారు. పశ్చిమ బంగా, ఏపీ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలను ఆపలేదు. అటు హైకోర్టు కూడా రాష్ట్రంలో ఈ పుర ఎన్నికలపై నిర్ణయాన్ని ఎస్ఈసీ, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించడంపై ఏం చేద్దామనేది సందిగ్థత నెలకొంది. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ ముందుకెళ్లాలని సూచిస్తారా… లేకుంటే ఇప్పుడు వాయిదా వేస్తారా… అనేది చర్చగా మారింది. ప్రస్తుతం వాయిదా వేస్తే మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనేది కూడా తెలియడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాయిదా వేస్తే కొవిడ్ పూర్తిగా కట్టడిలోకి వచ్చిన తర్వాతే మళ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటోంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో ఎవరికీ తెలియని ప్రశ్న. ఈ పరిణామాల్లో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో మాత్రం అధికారులు ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు.