మాకు ఆరు నెలల నుంచి జీతాలివ్వడంలేదు

by Shyam |
మాకు ఆరు నెలల నుంచి జీతాలివ్వడంలేదు
X

దిశ, హైదరాబాద్: ఎవరికైనా ఆక్సిడెంట్ అయినా.. ఆపరేషన్ జరిగినా బ్లడ్ అవసరం. బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి ఫోన్ చేయగానే బ్లడ్ తీసుకుని దవాఖానకు వస్తారు. అలాంటి సిబ్బంది ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులకు మొరపెట్టకున్నా జీతాలివ్వడం లేదు. వారి వేతనాలపై వైద్య విధాన పరిషత్ కూడా చేతులెత్తేసింది. దాంతో రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది బతుకులు అగమ్యగోచరంగా మారాయి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ చురుకుగా విధులు నిర్వర్తిస్తున్న తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఓ వైపు కొవిడ్ భయం, మరో వైపు కుటుంబాలను ఎలా సాకాలనే మానసిక ఆందోళనతో సతమవుతున్నామని చెబుతున్నారు.

సొసైటీలతో నియమాకాలు..

నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ స్కీం ( ప్రస్తుతం నేషనల్ హెల్త్ మిషన్)లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రధాన ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకుల్లో పనిచేసేందుకు సిబ్బంది నియామకం జరిగింది. ఇందుకు ఐఆర్‌సీఎస్ (ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ)తో ఎన్‌హెచ్‌ఆర్ఎం 2006లో ఒప్పందం కుదుర్చుకుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని 20 బ్లడ్ బ్యాంకులు, 89 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లలో టెక్నికల్ సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నిషియన్, స్టాఫ్ నర్సు, హెల్పర్స్, పీఆర్వో, డేటా ఎంట్రీ తదితర సిబ్బందిని రిక్రుట్ చేసుకున్నారు. తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా కూడా సిబ్బంది నియామకం జరిగింది. తెలంగాణలో (హైదరాబాద్ మినహా) 9 బ్లడ్ బ్యాంకులు, 31 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లున్నాయి. వీటిలో 564 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో ఐఆర్‌సీఎస్ నుంచి 214 మంది, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి 350 మంది రిక్రుటయ్యారు.

విధులు ఒకటే.. వేతనాల్లోనే తేడా

ఐఆర్‌సీఎస్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రెండిటి ద్వారా నియామకమైన సిబ్బందికి ఒకే విధులు. వారిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే బ్లడ్ బ్యాంకుల్లోనే పని చేస్తారు. కానీ, వీరి వేతనాల్లో మాత్రం సగానికిపైగా తేడా ఉంటోంది. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బందికి నెలకు రూ.24 వేలు అందుతుండగా, ఐఆర్‌సీఎస్ సిబ్బందికేమో రూ.11,741 మాత్రమే అందుతోంది. విభజిత ఏపీలో పనిచేస్తున్న సిబ్బందికి అక్కడి ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రూ. 17,000 వేతనాన్ని ఇస్తోంది. కానీ, ప్రత్యేక తెలంగాణ స్టేట్‌లో ఐఆర్‌సీఎస్ సిబ్బందికి జీతాలే లేవు.

చేతులెత్తేసిన వైద్య విధాన పరిషత్

నేషనల్ హెల్త్ మిషన్ 2017లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో 2017 నుంచి ఐఆర్‌సీఎస్ ద్వారా నియమితులైన 214 మందిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ తన పరిధిలోని తీసుకుంది. 2017 నుంచి 2019 అక్టోబర్ వరకు వేతనాలను చెల్లించింది. ఆ తర్వాత నెల నవంబర్ నుంచి చేతులెత్తేసింది. అప్పట్నుంచి సిబ్బంది జీతం లేకుండానే పని చేస్తున్నారు. జీతాలు ఎందుకు చెల్లించడం లేదని అడిగితే నేషనల్ హెల్త్ మిషన్ నుంచి నిధులు రావడం లేదని చెబుతోంది వైద్య విధాన పరిషత్. అయితే, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది 350 మంది అంతా నేటికీ ఆ సొసైటీ ద్వారానే విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఆ సొసైటీయే వేతనాలు చెల్లిస్తోంది.

సీఎం కేసీఆర్ వద్ద పెండింగ్..

ఐఆర్‌సీఎస్ నుంచి వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వచ్చిన కొన్నాళ్లకే వీరికి వేతనాలు కేటాయించాలంటూ ఆ పరిషత్ కమిషనర్ 2017 అక్టోబర్ 10న వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు సమాధానంగా సిబ్బంది కేడర్ వివరాలు పంపాలని కోరారు. దాంతో వైద్య విధాన పరిషత్ కమిషనర్ 2018 జనవరి 16న జవాబు ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి కోసం ఈ ఫైల్ 2018 మార్చి 5వ తేదీన సచివాలయానికి చేరింది. ఫైల్ అక్కడకెళ్లి నేటికి రెండేండ్లు దాటినా అనుమతి లభించలేదు. పెండింగ్‌లోనే ఉంది. వేతనాలు లేక తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

మా గోడు పట్టించుకోండి సారూ: కనకచంద్రం, బ్లడ్ బ్యాంకు సిబ్బంది

మాకు ఆరు నెలలుగా వేతనాలు లేవు. మా తోటి సిబ్బంది ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా నేటికీ రూ. 24 వేల వేతనం తీసుకుంటున్నారు. కానీ, రెడ్ క్రాస్ సొసైటీలో రూ. 11,741 మాత్రమే అందుతోంది. మేం రెడ్ క్రాస్ సొసైటీ చేతిలో మోసపోయాం. ప్రత్యేక దృష్టి పెట్టి, మా వేతనాలు చెల్లింపుపై ప్రభుత్వం నిజా నిజాలు వెల్లడి చేయాలి. సీఎం పేషీలో మా ఫైల్ (నెంబర్ 615/ C2 HRM-2) ఉంది. మూడేండ్లుగా మా ఫైల్ సీఎం కేసీఆర్ చూడటం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారులను అడిగితే, ఫైల్ సీఎంవోలో ఉంది. మీరే వెళ్లి చేయించుకోండి అంటున్నారు. ప్రస్తుతం కరోనా విధుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు చేపడుతున్నాం. ఇప్పటికే 14 ఏండ్లు సర్వీస్ చేశాం. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా మాపై శ్రద్ధ వహించి మమ్ములను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేసుకోవాలి. ప్రతినెలా వేతనాలను అందజేయాలి.

Advertisement

Next Story

Most Viewed