- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీహెచ్ఎంసీ రిజల్ట్ ఎఫెక్ట్.. అక్కడ కారు ఆగింది!
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గడువు ముగియడానికి మూడు నెలల ముందునుంచే ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టాల్సి ఉన్నా.. ఇప్పటికింకా అలాంటి ప్రయత్నాలే ప్రారంభం కాలేదు. ఈ రెండింటికీ ఈసారి గడువు ముగిసిన తర్వాత మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ రెండింటి పదవీకాలం మార్చి 14వ తేదీ వరకు ఉంది. ఈలోగా కేంద్ర ఎన్నికల సంఘం (ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం) తుది ఓటర్ల జాబితాను విడుదల చేయడం, దానికి అనుగుణంగా వార్డుల పునర్ వ్యవస్థీకరణ, రిజర్వేషన్ల ఖరారు, పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించడం లాంటివన్నీ జరగాల్సి ఉంది. వీటన్నింటి దృష్ట్యా గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు ఎన్నికలు జరుగుతాయి. అవసరాన్ని బట్టి ప్రత్యేకాధికారుల పాలన వచ్చే అవకాశమూ ఉంది.
గడువు ప్రకారమే ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో బీజేపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది. కానీ అధికార టీఆర్ఎస్ మాత్రం ఆచితూచి ఆడుగులు వేయాలనుకుంటోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలు ఇక్కడ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో తొందరపడొద్దనే టీఆర్ఎస్ భావిస్తోంది. గతేడాది వచ్చిన వరదల సమయంలో ప్రభుత్వం బాధితులను పట్టించుకోకపోవడం, జీహెచ్ఎంసీ తరహాలో వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం లాంటి అంశాలు అధికార పార్టీకి ప్రతిబంధకంగా మారనున్నట్లు సంకేతాలు వచ్చాయి. దీంతో తొందరపడి ఆదరబాదరాగా ఎన్నికలకు వెళ్లవద్దనే అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టింది. వరదసాయం, ఎల్ఆర్ఎస్ లాంటి అంశాలను ప్రచారం చేస్తోంది. ఎలాగూ ఎల్ఆర్ఎస్ నుంచి ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చినా వరదసాయం విషయంలో మాత్రం ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి.
అన్నీ అనుకూలించాకే..
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆలోచిద్దామనే ధోరణిలో ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని కాస్త మెరుగుపర్చుకున్న తర్వాత వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఇప్పటివరకు జరిగిన డ్యామేజీని కాస్త చక్కిదిద్దుకోవచ్చన్న కోణంలో ఆలోచిస్తున్నట్లు సమాచారం.
దీనికి తోడు ఇటీవల పార్టీ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో సైతం చాలా ప్రతికూల పరిస్థితి ఉన్నట్లు స్పష్టం కావడంతో ‘వెయిట్ అండ్ వాచ్’ పద్ధతే ఉత్తమమన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఎలాగూ ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ లాంటి మరో ఐదు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నందున అన్నింటికీ కలిపి ఒకేసారి పెట్టవచ్చనుకుంటోంది. గడువు ముగిసిన తర్వాత కొంతకాలం ప్రత్యేకాధికారుల పాలనలో పెట్టి పరిస్థితులు అనుకూలంగా వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది.
మంత్రి వరంగల్ పర్యటన వాయిదా..
వరంగల్, ఖమ్మం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మంత్రి కేటీఆర్ రెండు చోట్ల టెక్స్‌టైల్ పార్కు, ఐటీ పార్కు లాంటి పలు ప్రకటనలు చేశారు. స్వయంగా ఈ రెండు జిల్లాల్లో పర్యటించారు. తాజాగా సోమవారం వరంగల్ పర్యటన ఉన్నప్పటికీ పలు కారణాలతో మంత్రి కేటీఆర్ దాన్ని వాయిదా వేసుకున్నారు.
రెండు నెలల ముందస్తు ఎన్నికలకు పోయి జీహెచ్ఎంసీలో చేదు అనుభవాలను చవిచూసినందువల్ల వరంగల్, ఖమ్మం ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు వస్తే రాష్ట్రవ్యాప్తంగా గడ్డు పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పాలనను గాడిలో పెట్టడానికి దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో వరంగల్, ఖమ్మం ఎన్నికల్లో సైతం లబ్ధి పొందడానికి కొన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ పరిస్థితి మెరుగుపడడానికి తీసకోవాల్సిన చర్యలన్నీ పూర్తయిన తర్వాతనే ఎన్నికలు వెళ్లడం ఉత్తమం అనే అభిప్రాయంతో ఉన్నందున ఇప్పట్లో ఎన్నికలు జరగకపోవచ్చన్నదే ఆ పార్టీ నేతల అభిప్రాయం.