నిజాంసాగర్ కెనాల్‌లో గోడ.. రాత్రికిరాత్రే నీటికి అడ్డుకట్ట

by Shyam |   ( Updated:2021-03-12 08:22:18.0  )
Nijansagar Canal
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజాంసాగర్ ప్రాజెక్టు కెనాల్‌లో గోడ కట్టారు. రాత్రికి రాత్రే ఓ గ్రామ రైతులు కాంక్రీట్ గోడను నిర్మించారు. ఈ ఘటన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సవాడ సెగ్మెంట్‌లో జరిగింది. దీంతో నీరందక ఆరు గ్రామాల ప్రజలు పరేషాన్ అవుతున్నారు. వర్ని మండలం శంకోరా గ్రామ రైతులు నీళ్లు పారుతున్న కెనాల్‌లో ఇసుక బస్తాలు అడ్డువేసి నాలుగు అడుగుల మేర కాంక్రీట్‌తో గోడ నిర్మించారు. ఈ విషయంపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చివరి ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ని మండలం హుమ్నాపూర్, చందూర్ మండలం ఘన్‌పూర్, బోధన్ మండలం మినార్‌పల్లి, సంగెం, భవానీపేట్, సాలూరా గ్రామాల ఆయకట్టుకు నీరు అందక పంట ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నీటి చౌర్యం, కాలువలకు గండి కొడితే కఠిన చర్యలు తీసుకునే నీటి పారుదల శాఖాధికారులకు అధికార పార్టీ నేతలు చేస్తే కనబడటం లేదా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఈ సీజన్‌లో 2.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు.

అక్రమ కట్టడాన్ని తొలగిస్తాం

సీసీ గోడ నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చాయని జలవనరుల శాఖ బాన్సువాడ ఇఇ జయంత్‌కుమార్ తెలిపారు. గోడ నిర్మాణంతో 25వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల అవుతోందని, అక్రమంగా నిర్మించిన గోడను తొలగించడం సాధ్యం కాదన్నారు. అధికారుల ఆదేశాల మేరకు 15 తర్వాత గోడను తొలిగిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed