ఆ అవోకాడో టోస్ట్ ధర 22 కోట్లు..? ఎందుకంత స్పెషల్ అంటే..?

by Shyam |   ( Updated:2021-09-24 04:48:03.0  )
ఆ అవోకాడో టోస్ట్ ధర 22 కోట్లు..? ఎందుకంత స్పెషల్ అంటే..?
X

దిశ, ఫీచర్స్: క్రీస్తు పూర్వం 10వేల ఏళ్ల నుంచే వాడుకలో ఉన్న పండు ‘అవొకాడో’. సెంట్రల్ అమెరికా, మెక్సికోలో ఎక్కువగా ఉపయోగించే ‘అవొకాడో’‌ను వివిధ వంటకాల్లోనూ ఉపయోగిస్తారు. అవొకాడోలో ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ వల్ల ఆ పండుని డైలీ డైట్‌లో చాలామంది భాగం చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శాండ్‌విచ్‌లో మీట్ బదులు ఈ పండు వాడితే కొన్ని చోట్ల మిల్క్ షేక్స్‌లో కూడా ఈ ఫ్రూట్‌ని ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో ‘అవోకాడో’ టోస్ట్ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రాంతాన్ని బట్టి భిన్నరకంగాను ఈ టోస్ట్ చేస్తుంటారు. అయితే ఏ ప్రాంతంలో తిన్నా.. దీని విలువ మహా అంటే ఐదారు వందలకు మించి మాత్రం ఊహించలేము. అది కూడా ఎక్కువే. అయితే మీరు 3 మిలియన్ డాలర్ల విలువైన అవోకాడో టోస్ట్‌ను ఊహించగలరా? 18 క్యారెట్ల బంగారంతో జర్మనీకి చెందిన ఆర్టిస్ట్ టిమ్ బెంగెల్ అవోకాడో టోస్ట్ బంగారు శిల్పాన్ని రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కాగా, నెటిజన్లు దీన్ని టేస్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

‘ఎవరు ఎప్పటికీ జీవించాలనుకుంటున్నారు?’ (Who Wants To Live Forever?) అనే పేరుతో, ఈ శిల్పం 27 పీసెస్‌గా రూపొందించాడు బెంగెల్. ఇందులో ఐదు టమోటా ముక్కలు, ఐదు ఉల్లిపాయ స్లైసెస్, ఐదు అవోకాడో స్ట్రిప్‌లు సహా పది అరుగుల లీవ్స్ ఉన్నాయి. ఈ శిల్పం మొత్తం 12 పౌండ్లు ఉండగా, దీని తయారీకి 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగించాడు. జర్మనీలో బెర్లిన్ ‘ఆర్ట్ వీక్ ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శించడానికి దీన్ని రూపొందించారు. ‘అవొకాడో మన సహస్రాబ్ది సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పండును గ్రీన్ గోల్డ్‌గా చెప్పొచ్చు’ అని టిమ్ బెంగెల్ అన్నాడు.

అవోకాడోలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండటంతో, దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్‌ కంటెంట్ కూడా సమృద్ధిగా ఉంటుంది, దీంతో ఆరోగ్యకరమైన గట్‌ను నిర్మించడంలో, వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అవోకాడో టోస్ట్‌ని బాగా ఇష్టపడతారు. మీరా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దీపికా పదుకుణే ఈ జాబితాలో ఉన్నారు.

Advertisement

Next Story