అమరావతి ఒకే వర్గానికి చెందిన రాజధాని.. రియల్ ఎస్టేట్ కోసమే.. చంద్రబాబు డ్రామాలు 

by srinivas |
Amaravati
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి టీడీపీయే అడ్డు అని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ –మూడు రాజధానులకు మద్దతుగా అనంతపురం కలెక్టరేట్ వద్ద మేధావులు, ప్రజా సంఘాలు సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ గిరిజమ్మ, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పై విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నాడని విమర్శించారు. తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల సభ చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. నాడు శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను పక్కనపెట్టి అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారంటూ మండిపడ్డారు. అమరావతి ఒక సామాజిక వర్గానికే చెందిన రాజధాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అంటే అమరావతి ఒక్కటే కాదు.. 13 జిల్లాలని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతం తీవ్రంగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, అవసరాలను గుర్తించాలని కోరారు. రాజధాని పేరిట చంద్రబాబు అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ను ప్రోత్సహిస్తున్నారని మాజీఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed