కరోనా ఆసుపత్రుల ఆవరణ గాలిలో వైరస్ కణాలు

by Shyam |
కరోనా ఆసుపత్రుల ఆవరణ గాలిలో వైరస్ కణాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా పేషెంట్లకు చికిత్స అందించడానికి ప్రత్యేకంగా పనిచేస్తున్న ఆసుపత్రుల ఆవరణలోని గాలి, ఐసీయూ-ఐసొలేషన్ వార్డుల్లోని ఉపరితల వాతావరణంలోనూ వైరస్ కణాలు ఉన్నట్లు వెల్లడైంది. పాజిటివ్ పేషెంట్లను వార్డుల్లోకి పంపడానికి ముందు, వారికి చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జి అయిన ఆరేడు గంటల తర్వాత తీసుకున్న గాలి నమూనాల్లో వైరస్ తేడాలను సీసీఎంబీ విశ్లేషించింది. హైదరాబాద్ నగరంలోని మూడు ఆసుపత్రులు (పేర్లు వెల్లడించడానికి నిరాకరించింది), పంజాబ్‌లోని మొహాలిలో మూడు ఆసుపత్రుల్లో సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం జరిపారు. కరోనా వార్డుల్లో మాత్రమే గాలిలో ఈ వైరస్ ఉన్నట్లు తేలిందని, నాన్-కొవిడ్ వార్డుల్లో లేదని తేటతెల్లమైంది.

గాలిలో కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకోడానికి నమూనాలను ప్రత్యేక పద్ధతుల్లో సేకరించామని, ఆర్‌టీ-పీసీఆర్ పద్ధతిలో లాబ్‌లో పరీక్షలు చేశామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కరోనా పేషెంట్లు ఉన్న వార్డుల్లో ఫ్యాన్. ఎయిర్ కండిషన్ వినియోగం ఉన్నప్పుడు, అవి లేనప్పుడు వేర్వేరుగా శాంపిళ్ళు తీసుకుని పేషెంట్ బెడ్‌కు ఎంత దూరం వరకు గాలిలో వైరస్ ఉందో పరీక్షించినట్లు తెలిపారు. ఫ్యాన్ లేదా ఏసీ ఉన్నప్పుడు గది మొత్తం వైరస్ ఆవరించిందని, అవి లేనప్పుడు క్లోజ్డ్ రూమ్‌గా ఉన్నచోట గరిష్టంగా 12 అడుగుల దూరం వరకు వ్యాపించినట్లు తెలిపారు. ఇక పేషెంట్‌లో కరోనా తీవ్రతకు, గదిలో ఉన్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా వైరస్ తీవ్రత కూడా ఎక్కువ ఉన్నట్లు తేలిందన్నారు.

హైదరాబాద్‌లో సెప్టెంబరు-నవంబరు మాసాల మధ్యలో మొత్తం మూడు ఆసుపత్రుల్లో 41 శాంపిళ్ళను సేకరించామని, మొహలిలో మాత్రం జూలై-డిసెంబరు మధ్యలో 23 శాంపిళ్ళను సేకరించినట్లు తెలిపారు. అధ్యయనం లోతుగా జరిగేందుకు ఒక పాజిటివ్ పేషెంట్‌లను వార్డులో ఒక మూలకు ఉంచి కొన్ని గంటల తర్వాత శాంపిళ్ళను సేకరించామని, తక్కువ తీవ్రత కలిగిన పేషెంట్లే అయినప్పటికీ గాలిలో తక్కువ దూరంలో వైరస్ ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఆ గదిలో గంట సేపు తక్కువ తీవ్రత కలిగిన పాజిటివ్ పేషెంట్లను ఉంచినా గాలిలో వైరస్ బైటపడిందని పేర్కొన్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులను గదిలో ఉంచినప్పుడు గాలిలో కనిపించే వైరసస్ తీవ్రత తక్కువగా ఉంటోందని, లక్షణాలు ఉన్నవారి విషయంలో తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఒక పాజిటివ్ పేషెంట్‌ను ఫ్యాన్, ఏసీ లాంటివి లేని పరిస్థితుల్లో గదిలో రెండు గంటల సేపు ఉంచిన తర్వాత రెండు మీటర్ల వరకు గాలిలో వైరస్ వ్యాపిస్తున్నట్లు వివరించారు.

మాస్కును మించిన వ్యాక్సిన్ లేదు
కరోనా బారి నుంచి తప్పించుకోడానికి మాస్కును మించిన వ్యాక్సిన్ లేదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చేంతవరకు మాస్కులే సోషల్ వ్యాక్సిన్లు అని అన్నారు. మాస్కును ధరించడమే వైరస్ బారిన పడకుండా కాపాడుకోడానికి ఉత్తమమైన మార్గమన్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్కు, హాండ్ వాష్… ఈ మూడు కరోనా నుంచి దూరంగా ఉండడానికి చాలా ఉపయోగకరమన్నారు.

Advertisement

Next Story

Most Viewed