ప్రజల ప్రాణాలతో పరిశ్రమలు చెలగాటం.. కళ్లు మూసుకున్న అధికారులు.!

by Shyam |
ప్రజల ప్రాణాలతో పరిశ్రమలు చెలగాటం.. కళ్లు మూసుకున్న అధికారులు.!
X

దిశ, మహేశ్వరం : తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మహేశ్వరం గేటు నుంచి మహేశ్వరం మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై మురుగు నీరు ఏరులై పారుతోంది. మంఖాల్ పారిశ్రామికవాడలోని పలు కంపెనీల నుంచి విషవాయువులతో కూడిన మురుగునీరు గత నెల రోజుల నుంచి ఏరులై ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారంటున్నారు స్థానిక ప్రజలు.

మురుగు నీరు కారణంగా విపరీతమైన దుర్వాసన విడుదలవుతుడంతో మహేశ్వరం మండల కేంద్రానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంఖాల్ పారిశ్రామిక వాడలోని పలు కంపెనీల నుంచి విడుదలవుతున్న విషవాయువులు(కెమికల్స్)తో కూడిన నీరు ప్రజయ్ వెంచర్ సమీపంలో ఉన్న మంఖాల్ చెరువు వాగులో కలుస్తున్నాయి. దీంతో, చెరువులోని చేపలు చనిపోతున్నాయి. భూగర్భ జలాల్లో నీళ్ళు కలవడంతో బోర్ల నుంచి వచ్చే నీరు.. నూనె సమరు లాగా ఉంటోందని మంఖాల్, మొహబ్బత్ నగర్ గ్రామస్థులు తెలుపుతున్నారు.

పారిశ్రామిక వాడ ప్రక్కనే ఉన్న మొహబ్బత్ నగర్ గ్రామంలో గొట్టపు బావులు(బోర్లలో) నీరు త్రాగడానికి కూడా ఇబ్బందిగా మారిందని వాపోయారు. బోరు బావుల్లో వేసిన పైపులు 6 నెలల కాలంలోనే తుప్పు పట్టి మోటార్లు దెబ్బతింటునాయనీ రైతులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక వాడ ప్రక్కన 60 ఫీట్లతో బోరు వేస్తే విపరీతమైన కెమికల్‌తో కూడిన నీరు.. నూనె సమరు లాగా వస్తుందంటున్నారు. కంపెనీల నుంచి వస్తున్న నీరును పక్షులు త్రాగడం వల్ల మంఖాల్ పారిశ్రామిక వాడలో పక్షులు చనిపోతున్నాయని అన్నారు. పలు కంపెనీలు రాత్రి వేళలో విచ్చలవిడిగా పొగను బయటకు విడుదల చేయడంతో పారిశ్రామిక వాడకు ప్రక్కనే ఉన్న మొహబ్బత్ నగర్, ప్రాజయ్ వెంచర్‌లో నివాసం ఉండే ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శివయాదవ్ మొహబ్బత్ నగర్ గ్రామం, మహేశ్వరం మండలం

మంఖాల్ పారిశ్రామిక వాడలోని పలు కంపెనీలు విషవాయువులతో కూడిన పొగను రాత్రి పూట విడుదల చేయడంతో మొహబ్బత్ నగర్ గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి పూట ఇంటి బయట ఉండాలంటే ముక్కు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. మహేశ్వరం మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన దారి నుంచి విషవాయువుతో కూడిన నీరు.. నెల రోజుల నుంచి ఏరులై పరుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

విషవాయువులతో కూడిన నీరు మంఖాల్ చెరువులోకి, వాగులోకి వెళ్తుందని అన్నారు. విష వాయులతో కూడిన నీరు పక్షులు త్రాగడం వల్ల మూగజీవాలు చనిపోతున్నాయని తెలిపారు. పారిశ్రామిక వాడ చుట్టు ప్రక్కల ఒక్క పక్షినైనా చూద్దామంటే కనిపించని పరిస్థితి ఏర్పడిందాన్ని ఆవేదన వ్యక్తం చేశారు. విషవాయుువులను వెదజల్లే కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed