దుబ్బాక బై పోల్ బరిలో రాములమ్మ !

by Anukaran |   ( Updated:2020-09-02 12:07:01.0  )
దుబ్బాక బై పోల్ బరిలో రాములమ్మ !
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల హఠాన్మరణంతో బై ఎలక్షన్‌ అనివార్యం కాగా, ప్రధాన పార్టీలన్నీ లెక్కలేసుకుంటున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించనప్పటికీ పార్టీల్లో రోజుకో ఊహాగానం బయటకు వస్తోంది. టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే అంటుండగా, బీజేపీ నుంచి మళ్లీ రఘునందన్‌రావుకు ఛాన్స్ ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫైర్ బ్రాండ్‌ విజయశాంతిని దుబ్బాక నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికకు బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో మెదక్ జిల్లా నుంచి పోటీ చేసి విజయశాంతి ఓడిపోయినప్పటికీ అక్కడి రాజకీయంపై పట్టు ఉండటమే గాక ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె అయితేనే గెలిచి నిలుస్తుందని అగ్రనేతలు అంచనా వేస్తున్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముత్యంరెడ్డి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే అంతటి బలం ఉన్న నేత దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీకి ఇంతవరకు దొరకలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ మళ్లీ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన టీజేఎస్‌ నేత భవానీరెడ్డిని నిలుపుతారని ప్రచారం జరిగినా.. కొత్తగా వచ్చిన వారికి టికెట్‌ కేటాయిస్తే క్యాడర్‌‌లో విభేదాలు వస్తాయని భావించి… పార్టీ స్టార్ క్యాంపెయిన్‌ విజయశాంతిని నిలబెట్టి సీటు ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు. రాములమ్మ వ్యక్తిగత ఇమేజ్‌‌కు కాంగ్రెస్ క్యాడర్‌ తోడైతే విజయం పక్కాగా వరిస్తుందని ఈనేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఆమె వైపునకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వీటన్నింటికి తోడు ఉద్యమ సమయం నుంచి అన్నిపార్టీల నేతలతో సత్సంబంధాలు, ప్రజాదరణ కలిసి వస్తాయని చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed