విజయనిర్మల పేరిట ఘట్టమనేని అవార్డు

by Shyam |
విజయనిర్మల పేరిట ఘట్టమనేని అవార్డు
X

విజయ నిర్మల.. పేరుకు తగినట్లు నిర్మలంగా పనిచేసి అఖండ విజయాలు అందుకున్నారు. తెలుగు సినీచరిత్రలో ఒక గొప్ప అధ్యాయాన్ని లిఖించారు. బాలనటిగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు అరవై ఏళ్లు తెలుగు కళామతల్లికి సేవ చేసుకునే భాగ్యాన్ని పొందారు. పాండురంగ మహత్మ్యం సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వచ్చిన విజయ నిర్మల… బాలకృష్ణుడిగా మురిపించారు. నీరజ సినిమాతో హీరోయిన్‌గా మారిన ఆమె.. తెలుగు సినిమా వినీలాకాశంలో ఓ ధృవతారలా మెరిశారు. చిరకాలం గుర్తుండిపోయే అద్భుతమైన పాత్రలు చేయడమే కాదు దర్శకురాలిగా ప్రపంచ సినీచరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయానికి చిరునామాగా మారారు. 42 సినిమాలకు దర్శకురాలిగా పనిచేసి కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా తనకు తానే సాటి అనిపించుకున్న విజయ నిర్మల… 95 శాతం హిట్లు సాధించి గిన్నిస్ రికార్డు సాధించారు.

భర్త సూపర్‌స్టార్ కృష్ణతో కలిసి అధిక సినిమాలు చేశారు విజయనిర్మల. దాదాపు 50 చిత్రాల్లో కలిసి నటించిన ఇద్దరు… రీల్ లైఫ్‌లో పర్‌ఫెక్ట్ అనిపించుకోవడమే కాదు… రియల్ లైఫ్‌లోనూ ఆదర్శ దంపతులు అనిపించుకున్నారు. ఒకరి చేతిని మరొకరు విడవకుండా తమ జీవితాన్ని కొనసాగిస్తుండగా…. కృష్ణగారిని ఒంటరితనంలోకి నెట్టేస్తూ అనంతలోకాల్లోకి వెళ్లిపోయారు విజయనిర్మల. 2019 జూన్‌ 27న ఈ లోకాన్ని వదిలిన విజయనిర్మల(ఫిబ్రవరి 20) జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్నినిర్వహించారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని నివాసంలో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహాన్నిమహేష్‌బాబు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆవిష్కరించారు. అంతకు ముందుగా విజయ నిర్మల తనయుడు నరేష్ పూజాకార్యక్రమాలు నిర్వహించగా కృష్ణ, కృష్ణంరాజు దంపతులు, మురళీ మోహన్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

సినీ పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణం చేసిన విజయనిర్మలగారి స్మరణార్థం ‘విజయ నిర్మల స్త్రీ శక్తి’ అవార్డును ఇచ్చేందుకు సంకల్పించింది ఘట్టమనేని కుటుంబం. ఆమె జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించిన వారు… దర్శకురాలు నందినికి తొలి విజయ నిర్మల స్త్రీ శక్తి అవార్డును అందించారు.

Advertisement

Next Story