‘దిశ’ కథనానికి స్పందన.. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు

by Sridhar Babu |
‘దిశ’ కథనానికి స్పందన.. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని‌లోని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బాలింతలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి అందించే ఆహారం పై ‘దిశ’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో పెద్దపెల్లి జిల్లా డీఆర్‌డీ‌ఓ అధికారులు స్పందించారు. గత నెల 12వ తేదీన “పేషెంట్లకు అందించే ఆహారంలో పురుగు” అనే వార్తా కథనం ప్రచురితం కావడంతో బుధవారం ఆసుపత్రిలో పలు వార్డులను పరిశీలించి బాలింతల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని ఆహారం తయారు చేసే భోజనశాలను తనిఖీ చేసి పరిశీలించారు.

ఈ సందర్భంగా పలువురు బాలింతలు అధికారులకు అసలు విషయాలు తెలియజేయడంతో అవాక్కయ్యారు. ప్రతిరోజు పెట్టాల్సిన పాలు బ్రెడ్‌తో పాటు కోడి గుడ్లు పెట్టడం లేదని ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని తెలియజేయడంతో అధికారులు పూర్తి నివేదిక తయారు చేసుకున్నారు. పేషెంట్ల నుండి వివరాలు అడిగి తెలుసుకొని పూర్తి సమాచారాన్ని సేకరించారు. హైదరాబాద్‌కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి‌కి ఫుడ్ కాంట్రాక్ట్ రావడంతో గోదావరిఖనికి చెందిన అధికార పార్టీ నాయకుడికి సబ్ కాంట్రాక్టును అప్పగించారు. బాలింతలకు పెట్టే ఆహారం పై సబ్ కాంట్రాక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెలివరీ అయిన బాలింతలకు పౌష్టికాహారం పంపించాల్సింది పోయి నాణ్యత లోపించిన ఆహారం పెడుతుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది పేషెంట్ల బంధువులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్‌కు అందిస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రిని పరిశీలించిన వారిలో డీఆర్‌డీఓ అధికారులు శ్రీధర్, రమేష్, మెడికల్ సూపరిండెంట్ కంది శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎంఓ భీష్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed