వరదసాయంపై అయోమయం

by Anukaran |
వరదసాయంపై అయోమయం
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్‌లో వరద సాయంపై అయోమయం నెలకొంది. బల్దియా ఎన్నికలకు ముందు వరద సాయం పంపిణీ పేరిట సర్కారు హడావిడి చేసింది. ఫలితాల తర్వాత సాయం అందించేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించింది. గత నెలలో బల్దియా ఎన్నికల నియామవళి అమలులో ఉన్నందున నిలిపేశారు. ఎన్నికల అనంతరం డిసెంబర్ 7నుంచి పంపిణీ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో సాయం కోసం హైదరాబాద్ లోని పలు మీ సేవ కేంద్రాల వద్ద సోమవారం జనం క్యూ కట్టారు.

మొఖం చాటేసిన ప్రజాప్రతినిధులు..

వరద సాయం కోసం వేలాది మంది మీ సెంటర్ల వద్ద బారులు దీరినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. సాయం ఏప్పుడు ఇస్తారు.. అసలు ఇస్తారా..? ఇవ్వారా…? అనే విషయం తెలియక జనం ఆందోళనకు గురయ్యారు. మీ సేవ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. జనం తాకిడి విషయం తెలుసుకున్న మీ సేవ సెంటర్ల నిర్వహకులు వాటిని తెరవలేదు. దీంతో పోలీసులు వచ్చి వారిని వెళ్లిపోవాలని సూచించారు. అయితే బాధితుల్లో మాత్రం ఆయోమయం కన్పించింది. సీఎం కేసీఆర్ సోమవారం నుంచి పంపిణీ చేస్తామని చేప్పినట్లు పలువురు బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని బాధితులు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో తమకు ఓటు వేస్తే.. ఎన్నికల తర్వాతనే సాయం అందిస్తామని అధికార పార్టీ సభ్యులు చెప్పారని, బీజేపీ పార్టీ తరపున పోటీ చేసిన వారు సైతం రూ.25వేలు ఇంటింటికీ ఇస్తామని చెప్పారని, తీరా సమాయానికి పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాయం కోసం ఆందోళనలు..

వరద సాయం కోసం బాధితులు నగరంలోని పలు మీ సేవ కేంద్రాల వద్ద సోమవారం ఉదయం నుంచే బారులుదీరారు. అల్వాల్ లోని మీ సేవ కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున వరద బాధితులు చేరుకున్నారు. మీ సేవ సెంటర్ తెరవకపోవడంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. వరదలకు నష్టపోయిన తమను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

– సీఎం క్యాంప్ ఆఫీస్‌కు సమీపంలోని మీ సేవ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. బాధితులను పోలీసులు చెదరగొట్టారు. లాక్‌డౌన్‌లో ఏ విధంగా అయితే పరిహారం ఇచ్చారో అదే విధంగా రూ.10వేలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. సెకెండ్ ఫ్లోర్ ఉన్న వారికి వరద సహాయం చేశారు. కానీ, నిజమైన బాధితులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి మీసేవ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నామని బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

– బాధితులందరికీ వరద సాయం ఇచ్చి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ బాలానగర్ మీసేవ కేంద్రం ప్రజలు ఆందోళనకు దిగారు. జనం మీసేవ కేంద్రాలకు తండోపతండాలుగా రావడంతో నిర్వహకులు మీ సేవా సెంటర్లను మూసివేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు కలుగ జేసుకొని బాధితులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

కార్పొరేటర్ ఇంటి ముట్టడి..

వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ ఇంటి ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులంతా ఒక్కసారిగా కార్పొరేటర్ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పలు చోట్ల మీ సేవ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో బాధితులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీసేవ సెంటర్లకు రావొద్దు

వరద సాయానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ సోమవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. వరదసాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లకు రావద్దని సూచించారు. అర్హులను గుర్తించి వరదసాయం అందిస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయని, వరదసాయం అందని వారి వివరాలను అధికారులు సేకరిస్తారని చెప్పారు. బాధితుల అకౌంట్‌లోనే వరదసాయం నగదు జమ చేస్తామని లోకేష్‌ కుమార్‌ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed