ఓటును కరెన్సీకి అమ్ముకోవద్దు : వెంకయ్య

by Shyam |   ( Updated:2021-04-01 03:43:45.0  )
ఓటును కరెన్సీకి అమ్ముకోవద్దు : వెంకయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో : సమాజ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమర్ధులైనవారిని ఎన్నుకోవాలే తప్ప కరెన్సీ నోట్లకు ఓటును అమ్ముకోవద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి, పనితీరును దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. పోటీచేస్తున్న అభ్యర్థులను ‘4-సీ’ (క్యారెక్టర్, కెపాసిటీ, కాలిబర్, కాండక్ట్) ప్రాతిపదికన విశ్లేషించుకోవాలని కోరారు. కానీ మరో నాలుగు ‘సీ’లను చూసి ఓటు వేస్తే ఆశించిన ఫలితం రాదని, అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. క్యాస్ట్, కమ్యూనిటీ, క్రిమినల్ చరిత్ర, కరెన్సీ లాంటి నాలుగింటిని దృష్టిలో పెట్టుకోవద్దన్నారు. మనం వేసే ఓటుతోనే పాలన డిసైడ్ అవుతుందన్నారు.

తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి రాసిన పుస్తకాన్ని వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని నివాసంలో ఆవిష్కరించిన సందర్భంగా పాలనలో వస్తున్న మార్పులు, అది ప్రజల జీవితాలపై చూపుతున్న ప్రభావం గురించి వివరిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంకంటే పరిపాలన ముఖ్యమైనదని, అందులో ప్రజలను భాగస్వాములను చేయడం చాలా అవసరమన్నారు. ప్రజా ప్రతినిధులు చేసే చట్టాలు, వాటిని అమలు చేయడంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరాన్ని వెంకయ్య నొక్కిచెప్పారు. ప్రజలకు ఆంక్షలు లేని సుఖమైన జీవితాన్ని అందించడాన్నే ‘సుపరిపాలన’గా భావించగలమన్నారు.

ప్రభుత్వాలు ప్రజా విశ్వాసంతోనే గెలుస్తాయన్న అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత వారికి సంక్రమించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను క్రమబద్ధీకరించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed