నానావతి ఆసుపత్రిలో చేరిన వరవరరావు

by Anukaran |   ( Updated:2020-07-19 12:00:20.0  )
నానావతి ఆసుపత్రిలో చేరిన వరవరరావు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తీవ్ర అనారోగ్యంతో ఉంటూ ఇటీవల కరోనా బారిన పడిన మానవ హక్కుల కార్యకర్త వరవరరావును జైలు అధికారులు ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేర్చారు. జేజే ఆసుపత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నానావతి ఆసుపత్రికి చేరుకున్నారని, ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కరోనా సంబంధితమైన సమస్యలేవీ లేవని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆకాశ్ ఖోబ్రగడే తెలిపారు. కానీ న్యూరోలాజికల్, యూరాలజీ సమస్యలు మాత్రం ఉన్నాయని, వీటికి సంబంధించి మరిన్ని వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ఆ వైరస్‌కు సంబంధించిన లక్షణాలేవీ ఇప్పటివరకు బహిర్గతం కాలేదని, దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తలేదని తెలిపారు.

భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి అరెస్టయిన వరవరరావు దాదాపు ఏడాదిన్నర కాలంగా మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉంటున్నారు. మే చివరి వారంలో తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు జేజే ఆసుపత్రిలో చేర్పించిన జైలు అధికారులు ఆ తర్వాత మళ్ళీ జైలుకు తీసుకెళ్ళారు. మళ్ళీ ఈ నెలలో అంతకంటే తీవ్రమైన అనారోగ్యం పాలైనట్లు వార్తలు వచ్చినా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులతో పాటు కవులు, కళాకారులు, మేధావులు, అంతర్జాతీయ బుద్ధిజీవులు రాష్ట్రపతి మొదలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి వరకు ఎన్నో లేఖలు రాశారు. చివరకు ఆ ఒత్తిడి ఫలితంగా జేజే ఆసుపత్రికి తరలించారు. చివరకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కరోనా వార్డు సౌకర్యం ఉన్న నానావతి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అందుబాటులో ఉన్న అధునాతన వైద్యాన్ని అందించాల్సిందిగా ఆదేశించడంతో పాటు తాజా ఆరోగ్య పరిస్థితిపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆ రాష్ట్ర జైళ్ళ శాఖ డీజీపీ, ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. దీంతో నానావతి ఆసుపత్రిలో వైద్య చికిత్స లభిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed